
రాష్ట్రంలో రేషన్ బియ్యం స్కాంను వెలుగులోకి తెచ్చిన వైఎస్సార్‌సీపీ తిరుపతి బృందం
భూమన అభినయ్‌రెడ్డి నేతృత్వంలో రేషన్ షాపుల వద్ద తనిఖీలు
పేదలు తీసుకున్న బియ్యం షాపు వద్దే ఎలక్ట్రానిక్ కాటాపై తూకం
10 కిలోల బియ్యంలో 2 కిలోల కోత
25 కిలోల్లోనూ 2 కిలోలు తక్కువ
50 కిలోలకు వచ్చింది 46 కిలోలే
రాష్ట్రంలో భారీ బియ్యం స్కాం జరిగిందన్న భూమన అభినయ్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని తొలగించి, కూటమి ప్రభుత్వం తెచ్చిన పాత రేషన్ డీలర్ల వ్యవస్థలో తూకాల్లో మోసాలు చేసి పేదలను దోపిడీ చేస్తున్న వైనాన్ని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి బృందం బట్టబయలు చేసింది. అభినయ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం తిరుపతి నగరంలో పలు రేషన్ దుకాణాల్లో పేదలకు ఇచ్చిన బియ్యాన్ని తన బృందంతో కలిసి తనిఖీ చేసింది. ఒకే సమయంలో 12 రేషన్ దుకాణాల్లో పేదలు తీసుకున్న రేషన్ బియ్యాన్ని ఆ షాపుల వద్దే ఎలక్ట్రానిక్ కాటాపై తూకం వేయగా, 10 కిలోలకు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడైంది. 25 కిలోలకు 22.85 కిలోలే వచ్చింది.
అంటే ఇక్కడా 2 కిలోలకు పైగా కోత పడింది. 50 కిలోలు తీసుకున్న వారికి 46 కిలోలే వచ్చినట్లు తేలింది. అంటే 4 కిలోలు తగ్గిపోయింది. దాదాపు అందరి బ్యాగుల్లో తక్కువ బియ్యం తూగింది. ఇలా కిలోలకు కిలోలు రేషన్ బియ్యం పక్కదారిపడుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డుదారుల ఎదుటే బియ్యం తూకం వేసి తక్కువగా ఉన్నట్లు చూపించడంతో అనేక మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం, డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో భారీ బియ్యం స్కాం: భూమన అభినయ్‌రెడ్డి
ఏపీలో పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందని, ఇదో పెద్ద స్కాం అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేసే బియ్యం సుమారు 300 కోట్ల కిలోలు అని చెప్పారు. ఇందులో 10–15 శాతం అంటే 30 నుంచి 45 కోట్ల కిలోల బియ్యం కూటమి ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోతోందని తమ తనిఖీల ద్వారా స్పష్టంగా తెలిసిందని వివరించారు. ఈ బియ్యం కిలోకి రూ.15 నుంచి రూ.20కి అమ్మితే, ఈ స్కాం విలువ రూ.500 కోట్లు నుంచి 900 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇది కేవలం అక్రమ వాణిజ్యం కాదని, పేదల ఆకలిపైన, వారి న్యాయమైన హక్కుపై జరుగుతున్న దాడి అని చెప్పారు.
వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన డోర్ డెలివరీ నిర్ణయం చారిత్రకమైనదన్నారు. ప్రతి ఇంటికీ నేరుగా బియ్యం చేరేలా చేసి, మధ్యవర్తుల మోసాలకు తాళం వేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను రద్దు చేసి, మళ్లీ రేషన్ దుకాణాలే తెచ్చి, వాటి ద్వారా పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కి పంపిస్తూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఆ కోట్ల కిలోల బియ్యం ఎవరి చేతిలో మాయమైందని ప్రశ్నించారు. పేదల తిండిని అమ్ముకునే స్థాయికి పాలకులు దిగజారిపోయారని మండిపడ్డారు.
దీన్నేమంటావు పవన్..?
కొన్ని నెలల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఓడపై ఎక్కి, ‘సీజ్ ద షిప్’ అంటూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి వీడియోలు, ఫొటోలు, ఫ్లెక్సీలతో రచ్చ చేశారని అభినయ్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం నిజంగా బియ్యం మాయం అవుతోందని, మరి దీని మీద పవన్ ఏం చెప్తారని ప్రశ్నించారు. పైగా ఈ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖకు పవన్ సొంత పార్టీ నేతే మంత్రిగా ఉన్న విషయాన్ని అభినయ్ గుర్తుచేశారు.