ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ‘భారత్‌ దర్శన్‌’ 

Bharat Darshan under auspices of IRCTC - Sakshi

19న రాజమండ్రి నుంచి ప్రారంభం 

మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు ఆగ్రా, మధుర, అమృత్‌సర్, హరిద్వార్‌ ప్యాకేజీ 

సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ‘భారత్‌ దర్శన్‌’ పేరుతో పుణ్యక్షేత్రాలు, ఆహ్లాదకర ప్రాంతాలను కలుపుతూ ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ఐఆర్‌సీటీసీ టూరిజం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జీపీ కిశోర్‌ తెలిపారు. మంగళవారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు ఆగ్రా, మధుర, అమృత్‌సర్, హరిద్వార్‌లోని ప్రముఖ ప్రాంతాలను చుట్టి వచ్చేలా రైలు ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ రైలు మార్చి 19న రాజమండ్రి నుంచి బయలుదేరి పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి 27వ తేదీన గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు సామర్లకోట, తుని, విశాఖపట్నంలో రైలు ఎక్కొచ్చన్నారు.  

8 రాత్రులు, 9 పగళ్లు మొత్తం 8 రాత్రులు, 9 పగళ్ల ప్రయాణానికి 
భోజన వసతితో కలిపి స్లీపర్‌ క్లాస్‌ ధర రూ.8,510, త్రీటైర్‌ ఏసీ ధర రూ.10,400గా నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రతి శుక్రవారం విజయ్‌ గోవిందం పేరుతో విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్యాకేజీ నడుస్తోందన్నారు. 2 రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ టికెట్‌ ధర రూ.3,410, రూ.3,690గా ఉందన్నారు. సికింద్రాబాద్‌ నుంచి తెనాలి, గుంటూరు మీదుగా ప్రతి మంగళవారం కేరళకు 5 రాత్రులు, 6 పగళ్ల ప్యాకేజీలో అలప్పి–కొచ్చి–మున్నార్‌కు రూ.10,610, అలప్పి–మున్నార్‌కు రూ.10,280, అలప్పి–గురువాయుర్‌–కొచ్చికు రూ.8,910, కూనూర్‌–ఊటీకి రూ.9,730 టికెట్‌ రేటు నిర్ణయించామన్నారు.  

ఎయిర్‌ టూర్‌ ప్యాకేజీలు 
ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రాంతీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. మార్చి 1, 11, 21 తేదీల్లో, ఏప్రిల్‌ 15, 21 తేదీల్లో, మే 10, 17 తేదీల్లో కాశ్మీర్‌కు హౌస్‌బోటు అకామిడేషన్‌తో (శ్రీనగర్, సోమ్‌నగర్, గుల్మార్గ్, ఫహల్‌గామ్‌) రూ.27,750, ఏప్రిల్‌ 10న హిమాచల్‌–పాపులర్‌ పంజాబ్‌ (చంఢీగర్, సిమ్లా, ధర్మశాల, అమృత్‌సర్‌) పేరుతో రూ.33,100, మార్చి 3,5,10,12,17,19,24, ఏప్రిల్‌7,9,14,16,21,23,28 తేదీల్లో తిరుపతి బాలాజీ దర్శన్‌ (తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం) పేరుతో రూ.10,315 టిక్కెట్‌ ధరతో హైదరాబాద్‌ నుంచి విమాన సేవలందిస్తున్నామన్నారు. జూలై నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌ నుంచి లేక్, లద్దాక్, లేహ్, కాశ్మీర్, తిరుపతి, రాజస్థాన్, కేరళ వంటి ప్రాంతాలకు ఎయిర్‌ టూర్‌ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్‌ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు 82879 3232, 97013 60675 నంబర్లను సంప్రదించాలని సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top