బీసీ జన గణనతో మరింత మేలు: సీఎం వైఎస్‌ జగన్‌

BC Census Is Beneficial Says AP CM YS Jagan - Sakshi

బీసీలు ఎంత మంది ఉన్నారన్నది కచ్చితంగా తెలియాలి

అప్పుడే విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మరింత మేలు

అందుకే బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం

రెండున్నరేళ్లలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం విప్లవాత్మక చర్యలు

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ప్రయోజనం

అన్ని పదవుల్లోనూ బీసీలకే అగ్ర ప్రాధాన్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఐక్యంగా ఉండాలి

సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండున్నరేళ్లలో బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నాం. విద్యా పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు మరింత మంచి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన నిర్వహించాలి. బీసీల జనాభా ఎంతన్నది కచ్చితంగా తెలిస్తే వారికి ప్రభుత్వాలు మరింత మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే బీసీ జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ద్వారా తీర్మానం చేసి పంపుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

బీసీ జనగణన చేయాలని కోరుతూ శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై  ఆయన మాట్లాడారు. దేశంలో బీసీల జనాభా దాదాపు 52 శాతం ఉంటుందని అంచనా అని, అయితే ఏనాడు బీసీల సంఖ్య ఎంతన్నది జనాభా లెక్కల్లో మదింపు చేయలేదన్నారు. 1931లో బ్రిటీష్‌ పాలనలో మాత్రమే కులపరమైన జన గణన చేశారని చెప్పారు. కుల పరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 ఏళ్లు అయ్యిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంతనేది కేవలం అందాజుగా.. సుమారుగా అన్న బాపతులోనే లెక్క వేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ ఏమన్నారంటే..

లెక్క తెలిస్తేనే మరింత లబ్ధి
బీసీల గురించి కచ్చితమైన లెక్క తెలిస్తేనే వారి మేలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వాలకు స్పష్టత ఉంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనగణనలో అంటే 1951 నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు సేకరించలేదు.

జన గణనలో కుల పరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం గురించి మరింత విస్తృతంగా ఆలోచించాలి. నిజానికి జనాభా లెక్కలు 2020లో జరగాలి. కరోనా, వివిధ కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు మొదలు కాబోతున్నాయి.

సమాజంలో కొద్ది మంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారన్న భావన వల్ల కావచ్చు.. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో బీసీలను ఎదగనివ్వడం లేదన్న భావన వల్ల కావచ్చు.. పలు విధాలా వివక్షకు గురయ్యాం అన్న భావన వల్ల కావచ్చు.. వీటన్నింటి వల్ల బీసీ జనగణన జరగాలన్న డిమాండ్‌ ఆ వర్గాల నుంచి వస్తోంది. ‘మేము ఎంత మందిమి ఉన్నామనే సంఖ్య మీకు తెలిస్తేనే కదా.. ఏదైనా చేయడానికి వీలుండేది’ అని ఆ వర్గాల వారు అంటుండటంలో న్యాయం ఉంది.

బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా మార్చుతామని అధికారంలోకి రాకమునుపే ఏలూరులో పార్టీ తరఫున తీర్మానం చేశాం. ఆ దిశగా ఈ రెండున్నరేళ్ల కాలంలో అడుగులు పడ్డాయని ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. 

అడుగడుగునా సామాజిక న్యాయం
వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తంగా గెలిచిన, గెలవబోతున్న ఎమ్మెల్సీలు 32 మంది. వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారే.

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలే. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.

శాససనభ స్పీకర్‌ స్థానంలో బీసీని కూర్చోబెట్టే భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. తొలిసారి శాసన మండలి చైర్మన్‌ పదవిని దళితులకు ఇవ్వగలిగామని గర్వంగా తెలియజేస్తున్నా. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించాం.

నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చేట్టు చట్టం చేశాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం చట్టం చేసి ఇవ్వగలిగాం.

మొత్తం 648 మండలాలకు గాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్నది 635. అందులో బీసీలకు 239 మండల అధ్యక్ష పదవులిచ్చాం. అంటే 38 శాతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి మొత్తం 67 శాతం పదవులు ఇచ్చాం.

మొత్తం 13 జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 6 పదవులు ఇచ్చాం. అంటే 46 శాతం పదవులు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 69 శాతం జెడ్పీ చైర్మన్‌ పదవులిచ్చాం.

13 మునిసిపల్‌ మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏడు పదవులు ఇచ్చాం. అంటే 54 శాతం పదవులు.  మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 92 శాతం పదవులు ఇచ్చాం.

మొత్తం 87 మునిసిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ 84 గెలుచుకుంది. ఒకటి టై అయింది. ఫలితం ఇంకా రాలేదు. టాస్‌లో దేవుడి ఆశీర్వచనం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇచ్చిన 84 మునిసిపల్‌ చైర్మన్‌ పదవుల్లో 37 పదవులు బీసీలకే ఇచ్చాం. అంటే 44% పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 73% పదవులిచ్చాం. దేవుడి దయతో కొండపల్లి కూడా వస్తే బీసీలకు మరో పదవి పెరుగుతుంది.

196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకే ఇచ్చాం. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం ఇచ్చాం. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవుల నియామకాల్లో 53 బీసీలకే ఇచ్చాం. ఇది 39 శాతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుంటే 58 శాతం ఇచ్చాం. ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం.

137 కార్పొరేషన్‌లలో మొత్తం 484 నామినేటెడ్‌ డైరెక్టర్ల పదవుల్లో 201 బీసీలకే ఇచ్చాం. అంటే డైరెక్టర్లలో బీసీలు 42 శాతం మంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి మొత్తం 58 శాతం డైరెక్టర్‌ పదవులు ఇచ్చాం.

ఇవి కాక 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, 1 ఎస్టీ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్ల పోస్టులన్నీ కూడా ఆ వర్గాలకే ఇచ్చాం. 

శాశ్వత ఉద్యోగాలలోనూ...
గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. వాటిలో 83% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఈ 29 నెలల్లో 2.70 లక్షల వలంటీర్‌ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకుని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం.

పేద వర్గాలన్నీ ఒక్కటిగా ఉండాలి
దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను. అట్టగుడు వర్గాల్లో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఈ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటిగా ఉండాలి. విభజించు పరిపాలించు అన్న గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలకు చరమగీతం పాడాలి.

టీడీపీ పాలనలో బీసీల విభజన
టీడీపీ పాలనలో తమకు ఓటు వేసిన వారెవరు.. ఓటు వేయని వారెవరు అని బీసీలను విభజించారు. ఓటు వేసిన వారికి కొద్దో గొప్పో ఇస్తాం, వేయని వారికి లేదు.. అనే పరిస్థితి ఉండేది. జన్మభూమి కమిటీల పేరుతో ఏ రకంగా చేశారన్నది అందరికీ తెలుసు. 

మన పాలనలో అర్హతే ప్రామాణికత 
మనందరి పరిపాలనలో బీసీలందరూ మనవాళ్లే.. అని భావించి మనకు ఓటు వేసినా, వేయకపోయినా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ బీమా.. ఇలా అన్ని పథకాలు మంజూరు చేశాం. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా 31 లక్షల మందికి ఇచ్చాం. సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ మంచి చేయగలిగాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top