హైకోర్టును కర్నూలుకు తరలించాలి

Bar Association demands High Court be shifted to Kurnool District - Sakshi

విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన న్యాయవాదులు

హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరిక  

కర్నూలు(సెంట్రల్‌/లీగల్‌): కర్నూలుకు వెంటనే హైకోర్టును తరలించాలని కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి.. కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ చేశారు.

అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ కృష్ణ, జేఏసీ కన్వీనర్‌ వై.జయరాజ్‌ మాట్లాడుతూ.. గతంలో కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ హైకోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు.

హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు విధులను బహిష్కరించి.. తమ ఆందోళన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్‌ న్యాయవాదులు ఓంకార్, వి.నాగలక్ష్మీ, పి.సువర్ణరెడ్డి, ఎం.సుబ్బయ్య, బి,చంద్రుడు, కర్నాటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top