
సాక్షి, అమరావతి: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో తొలిరోజు విజయవంతమైందని, దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బంద్‌లో భాగంగా రాష్ట్రంలో కూడా సోమవారం బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్‌బీఐ జోనల్ కార్యక్రమం వద్ద బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఐబాక్) రాష్ట్ర కార్యదర్శి వైవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు వెనుకాడమని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, రూ.వేల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మంగళవారం సమ్మెను కూడా విజయవంతం చేయనున్నట్లు తెలిపారు.