
కృష్ణా జిల్లా బల్లిపర్రులో దళిత మహిళపై దాష్టికం
పెడన: రాష్ట్రంలో మరో దళిత మహిళపై దారుణం జరిగింది. దళిత మహిళను చితకబాదటమే కాకుండా దుస్తుల్ని చించిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రులో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత మహిళ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహిళ కుటుంబం బల్లిపర్రులో నివాసం ఉంటోంది. భర్త ఆర్టీసీ ఉద్యోగి కావడంతో గురువారం డ్యూటీకి వెళ్లారు.
అ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటిముందు తన కుమారుడితోపాటు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా.. ఎవరో విసిరిన కర్ర వచ్చి కుమారుడికి తగిలింది. పిల్లాడికి తగలరాని చోట తగిలితే పరిస్థితి ఏమిటని ఆమె కేకలు వేసింది. దీంతో ఆ ఇంటి సమీపంలో ఉండే గాదె సురేంద్ర, గాదె నరేంద్ర, గాదె నాగ వచ్చి ఆమెను కింద పడేసి చితకబాదారు. ఆమె ధరించిన నైటీని చించివేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు ఇచి్చన సమాచారం మేరకు పెడన పోలీసులు విచారణ చేపట్టారు.