balliparru
-
దళిత మహిళపై దారుణం
పెడన: రాష్ట్రంలో మరో దళిత మహిళపై దారుణం జరిగింది. దళిత మహిళను చితకబాదటమే కాకుండా దుస్తుల్ని చించిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రులో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత మహిళ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహిళ కుటుంబం బల్లిపర్రులో నివాసం ఉంటోంది. భర్త ఆర్టీసీ ఉద్యోగి కావడంతో గురువారం డ్యూటీకి వెళ్లారు.అ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటిముందు తన కుమారుడితోపాటు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా.. ఎవరో విసిరిన కర్ర వచ్చి కుమారుడికి తగిలింది. పిల్లాడికి తగలరాని చోట తగిలితే పరిస్థితి ఏమిటని ఆమె కేకలు వేసింది. దీంతో ఆ ఇంటి సమీపంలో ఉండే గాదె సురేంద్ర, గాదె నరేంద్ర, గాదె నాగ వచ్చి ఆమెను కింద పడేసి చితకబాదారు. ఆమె ధరించిన నైటీని చించివేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు ఇచి్చన సమాచారం మేరకు పెడన పోలీసులు విచారణ చేపట్టారు. -
చలపతిరావు మృతితో బల్లిపర్రులో విషాదం
బల్లిపర్రు (పామర్రు) : ప్రముఖ సినీనటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) మృతి ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతిపట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, మంచి మిత్రుణ్ణి కోల్పోయామని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో తనకున్న స్థలంలో ఒక చిన్న ఇల్లుని నిర్మించారని దానిని తన సోదరి అయిన భ్రమరాంబకు ఇచ్చారన్నారు. ఏటా గ్రామానికి వచ్చి స్థానికులు, బంధువులతో ఆయన ముచ్చటించే వారని, గ్రామంలో ఉన్న 1.40 ఎకరాల పొలాన్ని చలపతిరావే సాగు చేస్తుండేవారని వారు తెలిపారు. స్థానిక గంగానమ్మ ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందజేశారని వారు గుర్తుచేశారు. అత్తవారి ఇల్లు కూడా పామర్రు మండల పరిధిలోని జమీగొల్వేపల్లి గ్రామం కావడంతో అక్కడి వారితో కూడా సత్సంబంధాలున్నాయని తెలిపారు. -
బల్లిపర్రులో నాలుగు పూరిళ్లు దగ్ధం
బల్లిపర్రు (గన్నవరం రూరల్) : తెంపల్లె శివారు గ్రామం బల్లిపర్రులో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లోయ జేజేరావు, సాంబశివరావు, మురళీకృష్ణ గృహాలతో పాటు సాంబశివరావుకు చెందిన గేదెల పాక మంటల్లో కాలిపోయింది. జేజేరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించటంతో అతని తలభాగం కాలినట్లు స్థానికులు చెప్పారు. మంటల్లో చిక్కుకున్న జేజేరావును బంధువులు బయటకు తీసుకువచ్చారు. గాయపడిన జేజేరావును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. జేజేరావు ఇంట్లో రూ.లక్ష నగదు, 4 కాసుల బంగారం, దస్తావేజులు, సాంబశివరావు ఇంట్లో రూ.20 వేల నగదు, దస్తావేజులు, రెండు కాసుల బంగారం, మురళీకృష్ణ ఇంట్లో 4.5 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, 2,500 నగదు, బంగారు ఉంగరాలు, దుస్తులు తదితరాలన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో జేజేరావు ఇంట్లోని గ్యాస్ సిలిండరు పేలిందని గ్రామస్తులు చెప్పారు. జేజేరావు ఇంటి నుంచి ఎగసిపడిన మంటలు గ్రామస్తులు అప్రమత్తమయ్యేలోపు మిగిలిన ఇళ్లను చుట్టుముట్టాయి. గన్నవరం అగ్ని మాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. ఇదే ప్రమాదంలో సమీపంలోని వీర్ల సీతారామయ్య ఇంటి పైకప్పుకు నిప్పు అంటుకోగా గ్రామస్తులు పైకప్పు తాటి ఆకులను పీకేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ నిమ్మకూరి విజయ్కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు. ప్రమాద నష్టం రూ.10 లక్షలు ఉంటుందని గ్రామస్తులు చెప్పారు.