నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి

Avanthi Srinivas says that Permission to enter tourist areas from today - Sakshi

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడి 

రూ.164 కోట్లతో రుషికొండలోని హరిత హోటల్‌ బ్లూబే హోటల్‌గా అభివృద్ధి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం నుంచి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.164 కోట్లతో విశాఖ రుషికొండలోని హరిత హోటల్‌ను పర్యాటక శాఖ బ్లూబే హోటల్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదన్నారు. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ (షిప్‌ రెస్టారెంట్‌) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్‌ కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా గండికోటను హార్సిలీహిల్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. 

సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణం 
రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యమయ్యాయన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ఒబెరాయ్‌ హోటల్‌ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడం ద్వారా 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు. ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్‌ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 

వారికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం 
ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top