వైఎస్సార్‌ జిల్లాలో వజ్రాల లభ్యత: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

Availability of diamonds in YSR District Central Govt reports to Andhra Pradesh - Sakshi

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడి

ఏపీకి 9 గనుల నివేదికలు అందజేసిన కేంద్రం 

నెల్లూరు జిల్లాలో బేస్‌ మెటల్‌

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాంగనీస్‌

ప్రకాశం జిల్లాలో ఇనుప ఖనిజం 

వీటికి కాంపోజిట్‌ లైసెన్స్‌లు ఇచ్చేందుకు త్వరలో వేలం

సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏపీలోని వైఎస్సార్‌ జిల్లా పరిధిలో పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ–4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్‌ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్‌ శాఖలతో ఢిల్లీలో బుధవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు. మైనింగ్‌ బ్లాక్‌ల నివేదికలను స్వీకరించిన రాష్ట్రాలు ఇక ఆలస్యం లేకుండా వేలాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మైనింగ్‌ రంగాన్ని ఉత్తేజ పరచడానికి వీలుగా దేశంలో ఖనిజ అన్వేషణను వేగవంతం చేస్తోందని వివరించారు. మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్‌ బ్లాక్‌ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. ఏపీ తరఫున రాష్ట్ర మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి నివేదికలు అందుకున్నారు. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్‌ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. 

37 చ.కి.మీ మేర వజ్రాల బ్లాక్‌
వైఎస్సార్‌ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) అన్వేషణలో తేలింది. నెల్లూరు జిల్లా మాసాయపేట పరిధిలో 20 చ.కి.మీ మేర బేస్‌ మెటల్‌ ఉన్నట్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చ.కి.మీ, విశాఖపట్నం జిల్లా నందాలో 2.04 చ.కి.మీ, విజయనగరం జిల్లా గరికపేటలో 4.60 చ.కి.మీ, శివన్నదొర వలసలో 4.20 చ.కి.మీ, బుద్ధరాయవలసలో 6.38 చ.కి.మీ విస్తీర్ణంలో మాంగనీస్‌ బ్లాక్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్కపల్లెలో 30.23 చ.కి.మీ విస్తీర్ణంలో ఒకటి, అద్దంకివారిపాలెంలో 9.14 చ.కి.మీ విస్తీర్ణంలో మరొకటి మొత్తంగా 2 ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌లు ఉన్నాయని వెల్లడించింది.

ఆదాయం పెంచుకునేందుకే..
గతంలో ఈ స్థాయి సర్వే ప్రకారం గనులకు వేలం నిర్వహించవద్దని కేంద్రం చెప్పింది. అయితే ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో తాజాగా ఎంఎండీఆర్‌ (మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. వేలంలో లీజులు తీసుకున్న వారు వెంటనే మైనింగ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, 2, 1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్‌ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top