
ఢిల్లీ : ఢిల్లీ : పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణతో కుదుర్చుకున్న 4వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగించాలని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రితో ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు.
ఈ బేటీలో ప్రధానంగా సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను భట్టి విక్రమార్క కేంద్రమంత్రికి వివరించారు.అందుకే సోలార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని, గతంలో కుదుర్చుకున్న 4వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇరువురి సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘సోలార్ పవర్ విషయంలో కేంద్రం నూతన పాలసీ తీసుకువచ్చాక తెలంగాణ ప్రత్యేక దృష్టి సారించింది. 4 వేల మెగావాట్లతో సోలార్ పవర్‌లో భాగంగా రైతులకు పెద్ద ఎత్తున సోలార్ పంపులు పెట్టించాలని రాష్ట్రం నిర్ణయించింది. అయితే, కేంద్రం.. ముందస్తుగా తెలంగాణతో కుదర్చుకున్న 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను వెయ్యి మెగావాట్ల కుదించినట్లు సమాచారం అందింది. సోలార్ విద్యుత్‌ను కుదించొద్దని..గతంలో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణకు సోలార్ విద్యుత్ కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.