విశాఖపట్నం: ఖండాలు దాటిన బంధాన్ని భారతీయ సంప్రదాయం కట్టిపడేసింది. వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. అగ్నిహో త్రం సాక్షిగా వేసే ఏడడుగుల బంధం.. భారతీయ వివాహ వైభవం చూసి ఆ్రస్టేలియా జంట మనసు పారేసుకుంది. మిత్రుడి పెళ్లి కోసం విశాఖకు వచ్చిన విదేశీయులు.. ఇక్కడి హైందవ వైభవాన్ని చూసి ముగ్ధులై, వారూ అదే పద్ధతిలో అగి్నసాక్షిగా ఒక్కటయ్యారు. ఆ్రస్టేలియా రాజధాని కాన్‌బెర్రాకు చెందిన బ్రాడీ, ఎమిలీల వివాహం షీలానగర్‌లోని నమస్వీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది.
మిత్రుడి పెళ్లికి వచ్చి.. ముచ్చటపడి..
ఆ్రస్టేలియాలో జైళ్ల శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బ్రాడీకి, ఎమిలీతో స్వదేశంలోనే నిశ్చితార్థం జరిగింది. విశాఖకు చెందిన పోలీస్ అధికారి కుమారుడు రణసూర్య–సృజన వివాహానికి వీరు అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న వివాహ వేడుకలు, సంప్రదాయాలు, ఆచారాలను ప్రత్యక్షంగా చూసిన ఈ జంట పరవశించిపోయింది. తమ వివాహం కూడా ఇదే పద్ధతిలో జరగాలని ఆశపడ్డారు.
శాస్తోక్తంగా మూడు ముళ్ల బంధం
అనుకున్నదే తడవుగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి మండపంలో కూర్చున్నారు. పురోహితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ బ్రాడీ వధువు ఎమిలీ మెడలో మంగళసూత్రం కట్టి, నుదిటిన సింధూరం దిద్దాడు. అనంతరం ఒకరికొకరు పూలదండలు మార్చుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచారు. పరాయి దేశానికి చెందినవారైనా, మన సంస్కృతిపై మక్కువతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ విదేశీ జంటను అతిథులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
చదవండి: బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!


