సంక్షోభంలో కృష్ణా బేసిన్‌ | Groundwater level declining in Krishna Delta | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో కృష్ణా బేసిన్‌

Aug 29 2026 5:15 AM | Updated on Aug 29 2026 5:15 AM

Groundwater level declining in Krishna Delta

నదిలో ఏటా ప్రవహించే నీటి పరిమాణానికి సమానంగా రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 

బేసిన్‌ మూసుకుపోవడమంటే ఇదే 

బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నీటి ఎద్దడి.. తాగు నీటికీ కటకటే! 

సముద్రంలో కలిసే జలాలు 1973.44 టీఎంసీల నుంచి 458.12 టీఎంసీలకు తగ్గుదల 

కృష్ణా డెల్టాలో తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం 

భూమి పొరల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చి చౌడుబారిపోతున్న కృష్ణా డెల్టా 

చౌడు నేలలు పంటలకు అనుకూలం కాదు 

మడ అడవులపైనా తీవ్ర ప్రభావం 

ఐడబ్ల్యూఎంఐ అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్‌) సంక్షోభంలోకి కూరుకుపోతోందా? బేసిన్‌లో దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో నీటి ఎద్దడి తీవ్రం కానుందా? కృష్ణా డెల్టా చౌడుబారిపోయి సాగుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఇంటర్నేషనల్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐడబ్ల్యూఎంఐ) అధ్యయన నివేదిక. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేయకపోతే కృష్ణా డెల్టాలో సాగు నీరు దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తోంది.

కృష్ణా బేసిన్‌లో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, సాగు నీటి ప్రాజెక్టులు, పంటల సాగు, ప్రజల జీవనంపై ఐడబ్ల్యూఎంఐ విస్తృతంగా అధ్యయనం చేసింది. బేసిన్‌ మూసుకుపోతున్నట్లుగా గుర్తించింది. ఒక నదిలో ఏటా సగటున ప్రవాహించే నీటి పరిమాణానికి సమానంగా నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించడాన్ని బేసిన్‌ ‘మూసుకోపోవడం (క్లోజర్‌)’ అంటారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా సగటున 2,060 టీఎంసీల లభ్యత ఉంటుంది. 2005 నాటికే బేసిన్‌లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1920.58 టీఎంసీలు. అంటే.. 75 శాతం లభ్యత ఆధారంగా లభించే నీటిలో 80 శాతాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం రిజర్వాయర్లకు ఉంది. దాంతో కృష్ణా బేసిన్‌ మూసుకుపోయినట్లుగా ఐడబ్ల్యూఎంఐ ప్రకటించింది.  

ఐడబ్ల్యూఎంఐ నివేదికలో ప్రధానాంశాలు.. 
» మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో సతారా జిల్లాలో మహాబలేశ్వర్‌కు సమీపంలో జోర్‌ గ్రామం వద్ద సముద్రమట్టానికి 1,337 మీటర్ల ఎత్తులో పురుడు పోసుకునే కృష్ణమ్మ.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఏపీలోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.  
» కృష్ణా పరివాహక ప్రాంతం (బేసిన్‌) 2,58,948 చదరపు కిలోమీటర్లు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కృష్ణా బేసిన్‌ విస్తీర్ణం 8 శాతం. కృష్ణా బేసిన్‌ వైశాల్యంలో పశ్చిమ కనుమల పరిధి కేవలం 9.7 శాతమే. కానీ.. కృష్ణా నదిలో ప్రవహించే ప్రవాహంలో 57 శాతం జలాలు పశ్చిమ కనుమల్లో కురిసే వర్షపాతం నుంచే వస్తాయి.  
»   కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969లో ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. ఆ ట్రిబ్యునల్‌ 1976లో తీర్పు ఇచ్చింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన ట్రిబ్యునల్‌.. ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీలు, కర్ణాటకకు 700, మహారాష్ట్రకు 560 టీఎంసీలను కేటాయించింది.  
»   బేసిన్‌లో రాష్ట్రాలకు కేటాయించిన నీటి కంటే డిమాండ్‌ 200 శాతం అధికంగా ఉంది. ఇక కృష్ణా బేసిన్‌లో 50 శాతం సాగు భూమిలో చెరువులు, బోరు బావులు, వర్షాధారంగా పంటలు సాగుచేస్తున్నారు. 
»  2005 నాటికే కృష్ణాతోపాటు ఉప నదులు మలప్రభ, ఘటప్రభ, బీమా, తుంగభద్ర తదితరాలపై భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నిల్వ సామర్థ్యం 1920.58 టీఎంసీలు. అంటే.. నదిలో 75 శాతం లభ్యత లభించే జలాల పరిమాణంలో 80 శాతాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఆ రిజర్వాయర్లకు ఉంది. దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఎగువ నుంచి కృష్ణా జలాలు రావడం లేదు. ఇది నీటి ఎద్దడికి దారితీస్తోంది.  

కృష్ణా డెల్టాకు ప్రమాద ఘంటికలు.. 
» 1901 నుంచి 1960 మధ్య ఏటా సగటున 1973.44 టీఎంసీల ప్రవాహం కృష్ణా నది నుంచి బంగాళాఖాతంలో కలిసేది. కానీ.. 1994 తర్వాత ఏటా సగటున బంగాళాఖాతంలోకి కలిసే ప్రవాహం 458.12 టీఎంసీలకు తగ్గింది. 
» సముద్రంలో కలిసే నీటి పరిమాణం తగ్గడం వల్ల కృష్ణా డెల్టాలో భూగర్భ జలమట్టం క్రమేణా తగ్గుతోంది. ఆ స్థానంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది. ఇది నేలను చౌడుబారేలా చేస్తోంది. చౌడుబారిన నేల  పంటల సాగుకు అనువుగా ఉండదు.  
» సముద్రంలోకి కలిసే నీరు తగ్గడం.. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండడం వల్ల మడ అడవులు భారీ ఎత్తున దెబ్బతింటున్నాయి. ఇది కృష్ణా డెల్టాను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించకపోతే కృష్ణా డెల్టాకు పెనుముప్పు తప్పదు. 

కాలుష్యకాసారంగా కృష్ణా.. 
మహారాష్ట్రలో పుణే నగరం వద్ద బీమా నది కలుషితమవుతోంది. హైదరాబాద్‌ నుంచి మురుగునీరు, వ్యర్థాల వల్ల మూసీ కాలుష్యకాసారంగా మారింది. మూసీ నది కృష్ణాలో కలిసిన తర్వాత వాడపల్లి వద్ద నదీ జలాల నాణ్యత మరీ తీసికట్టుగా ఉంది. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి.. కాలుష్యానికి అడ్డుకట్ట వేయకపోతే కృష్ణా బేసిన్‌ తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement