విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల వేలం | Auction of Visakha Steel Plant lands | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల వేలం

Oct 14 2026 5:25 AM | Updated on Oct 14 2026 5:25 AM

Auction of Visakha Steel Plant lands

తొలిరోజే రూ.366.33 కోట్ల బిడ్లు  

రిజర్వ్‌ ధర కంటే 17.23 శాతం అధికంగా ధర పలికిన ప్లాట్లు  

గజం ధర రూ.1.80 లక్షలు దాటిన వైనం  

మిగిలిన 216 ప్లాట్లకు ఈ నెల 30న వేలం 

బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అక్టోబర్‌ 27లోగా రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలి 

కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి  

సాక్షి, న్యూఢిల్లీ/ఉక్కునగరం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ నిర్వహణ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)­కు చెందిన భూముల ఈ–వేలంలో తొలిరోజు రూ.366.33 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసీ) విశాఖపట్నంలోని ఈ స్థలాలకు ఈ–­వేలం నిర్వహించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటన మేరకు.. తొలివిడత మొత్తం 150 ప్లాట్లు విక్రయమయ్యాయి. ఈ ప్లాట్లకు నిర్ణయించిన రిజర్వ్‌ ధర రూ.312.48 కోట్లు కాగా, బిడ్ల ద్వారా రూ.366.33 కోట్ల విలువ నమోదైంది. రిజర్వ్‌ ధరతో పోలిస్తే 17.23 శాతం అధిక ధర లభించింది. అత్యధికంగా చదరపు గజానికి రూ.1.80 లక్షలకు పైగా ధర పలికింది.  

పారదర్శక విధానంలో ఈ–వేలం 
ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర ప్రభుత్వసంస్థల వద్ద వినియోగంలో లేని మిగులు భూములు, భవనాలను ఉత్పాదక అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా ఎన్‌ఎల్‌ఎంసీ ఈ ప్రక్రియను చేపట్టింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో సమన్వయం చేసుకుంటూ ఎన్‌ఎల్‌ఎంసీ వేలాన్ని నిర్వహించగా, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూఐపీఎల్‌) లావాదేవీల సలహాదారుగా వ్యవహరించింది. 

రైల్‌టెల్‌కు చెందిన ఈ–నివిదా ఆన్‌లైన్‌ వేదిక ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎల్‌ఎంసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంయుక్తంగా 2026 సెప్టెంబర్‌లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాల్లో భూముల వివరాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) నిబంధనలు, ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విధానంపై వివరించారు. 

మిగిలిన ప్లాట్లకు అక్టోబర్‌ 30న వేలం 
తొలివిడత ఈ–వేలానికి వచ్చిన స్పందన నేపథ్యంలో మిగిలిన 216 ప్లాట్లకు అక్టోబర్‌ 30న ఈ–వేలం నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ను మార్చి అదే తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆ ప్రకటనలో తెలిపింది. వేలంలో పాల్గొనాలనుకునే వారు అక్టోబర్‌ 27లోగా రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలని తెలిపింది. అందుబాటులో ఉన్న ప్లాట్ల వివరాలు, రిజర్వ్‌ ధరలు, అర్హత ప్రమాణాలు, పాల్గొనేందుకు అవసరమైన నిబంధనలను అధికారిక ఈ–వేలం పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్లాట్ల వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని గడువులోగా రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలని కేంద్రం సూచించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement