షష్ఠి సంబరం.. మొక్కులు చెల్లిస్తే సంతాన భాగ్యం 

Attili Subramanya Swamy Sashti Festival History And Significance In Telugu - Sakshi

షష్ఠి రోజున లక్ష మంది భక్తులకు స్వామి దర్శనం

భారీ విద్యుత్‌ సెట్టింగులు, పందిళ్లతో ఏర్పాట్లు పూర్తి

అత్తితి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి శతాబ్ధానికిపైగా చరిత్ర

స్వామికి మొక్కులు చెల్లిస్తే సంతాన, వివాహ భాగ్యం

సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిలా అత్తిలిలో జరిగే ఉత్సవాలు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఏటా అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, ఇలా ఎందరో స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తే తమ సమస్యలు తీరతాయని విశ్వసిస్తారు. శతాబ్దంపైగా చరిత్ర ఉన్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. ఈ ఏడాది డిసెంబరు 8 నుంచి షష్ఠి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఉత్సవాలకు శతాబ్దానికిపైగా చరిత్ర
అత్తిలిలో షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. 1910వ దశకంలో అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలోని కోనేటి వద్ద పెద్ద పుట్ట ఉండేది. అక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసేవారు. ఆ తర్వాత ఏకశిలపై శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతీసంవత్సరం మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామి వారి కల్యాణం, షష్ఠిన తీర్థం, రాత్రికి స్వామివారి ఊరేగింపు చేసేవారు. 1929లో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ ప్రముఖులు బాదరాల గోపాలం, కాకర్ల సోమన్న, మునసబు కానుమిల్లి వెంకటరామయ్య తదితరులు ఆలయ అభివృద్ధికి కృషిచేశారు.

భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్‌ అప్పట్లో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1932లో కల్యాణ మండపాన్ని,  1967లో అన్నదాన సత్రాన్ని నిర్మించారు. 1933లో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం 1994లో షష్ఠి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురవడంతో 1996లో మరొకటి ఏర్పాటుచేశారు. 1958లో అన్నదానం నిమిత్తం 4.49 ఎకరాలు, 1963 లో 2.74 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అత్తిలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరున ఆలయ కమిటీ సహకారంతో నెలకొల్పినవే. 

ఏటా ప్రముఖులకు సన్మానం
అత్తిలిలో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో రూ.కోట్ల వ్యయంతో భారీ కల్యాణ మండపాన్ని నిర్మించారు. షష్ఠి ఉత్సవాలు సందర్భంగా వివిధ రంగాల ప్రముఖుల్ని సన్మానించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఈలపాట రఘురామయ్యను తులాభారంతో సత్కరించిన ఖ్యాతి అత్తిలి షష్ఠి ఉత్సవాలకే దక్కింది. షష్ఠి తిరునాళ్ళ సమయంలో ప్రదర్శించే సాంఘిక, పౌరాణిక నాటకాలు చూసి తీరాల్సిందే. ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు, హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్యను 1968లో ఏనుగు అంబారీపై ఎక్కించి ఊరేగించారు. అల్లు రామలింగయ్య, చిరంజీవి, కృష్ణ, రాజనాల, బ్రహ్మానందం, శ్రీహరి ఇలా ఎందరో నటీనటుల్ని సన్మానించారు. 

మొక్కులు చెల్లిస్తే సంతాన భాగ్యం 
షష్ఠి కల్యాణం రాత్రి  సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకుని, నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. ఆలయం వెనుక భాగంలో కొద్దిసేపు నిద్రిస్తారు. సంతానం కలిగాక.. పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పిల్లలపై నుంచి బూరెలు పోసే సంప్రదాయం ఉంది. స్వామివారి ఆలయంలోకి ప్రతీ రోజు సాయంత్రం సోమసూత్రం గుండా ఒక సర్పం గర్భగుడిలోకి వచ్చి, మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని..  ఇది స్వామివారికి నిదర్శనమని ఆలయ అర్చకులు అయిలూరి శ్రీరామం తెలిపారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో, లేదా చెరువుగట్టున కుబుసం విడుస్తూ ఉంటుంది.

ఆ పాము కుబుసాన్ని అర్చకులు గర్భగుడిలో స్వామివారి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంటారు. ఈ ఏడాది షష్ఠి మహోత్సవాలు డిసెంబరు 8 నుంచి 22 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం, 9వ తేదీన షష్ఠి మహోత్సవం నిర్వహిస్తారు. కళావేదికపై ప్రతీ రోజు రాత్రి సినీ సంగీత విభావరి, బుర్రకథ, పౌరాణిక నాటకాలు, కోలాటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. తీర్ధ మహోత్సవం రాత్రి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుతారు. 

ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం
షష్ఠి మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశా. షష్ఠి  ఉత్సవాలకు జిల్లా నలుమూలలనుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పిస్తున్నాం. 
– కురెళ్ల ఉమామహేశ్వరరావు, షష్ఠి కమిటీ అధ్యక్షుడు, అత్తిలి

కోరిన కోర్కెలు తీర్చే స్వామి
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడు. సంతానం లేనివారు, వివాహం కానివారు స్వామివారిని దర్శించుకుంటారు. వారి కోర్కెలు స్వామి తీరుస్తాడు. ప్రతీ మంగళవారం, నెల షష్ఠి రోజున స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తుంటారు. 
– ఐలూరి శ్రీరామం, ఆలయ అ్చకులు. అత్తిలి

అత్తిలి షష్ఠి ప్రత్యేకతలు
► ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున చలువపందిళ్లను నిర్మించి, విద్యుత్‌ దీపాలతో భారీ ఎత్తున దేవతామూర్తుల సెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తారు. 
► ప్రతీ ఏటా ఆలయ పరిసరాలలో పెద్ద  ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ దుకాణాల్లో గృహోపకరణ, ఫ్యాన్సీ, పింగాణి, అలంకరణ వస్తువులే కాకుండా తినుబండారాల దుకాణాలు పదుల సంఖ్యలో ఉంటాయి. అలాగే భారీ ఎగ్జిబిషన్‌ ప్రత్యేక ఆకర్షణ. ఉత్సవాల ప్రారంభంలో సుమారు 200కు పైగా దుకాణాలు ప్రతీ ఏడాది ఏర్పాటు చేస్తారు. 
► షష్ఠినాడు స్వామివారి దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు జిల్లా నలుమూలలనుంచి వస్తుంటారు. మిగతా రోజుల్లో 3 నుంచి 5 వేల మంది వరకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 
► గతేడాది కరోనా నేపథ్యంలో ఉత్సవాలు సాధారణంగా జరిగాయి. ఈ ఏడాది వేలాది మంది హాజరుకానున్న దృష్ట్యా, ప్రతీ ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించేలా విస్తృత ప్రచారం చేపట్టారు. మాస్కు ధరించాలని, శానిటైజ్‌ చేసుకోవాలని, జ్వరం ఉన్నవారు ఉత్సవాలకు రావద్దని భక్తులకు విజ్ఙప్తి చేశారు.

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top