
శ్మశాన వాటికలో బలవంతంగా రోడ్డు నిర్మాణానికి యత్నం
తీవ్రంగా ప్రతిఘటించిన దళితులు.. ఉద్రిక్తత
రంగంలోకి నలుగురు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు
దళిత మహిళలపై దౌర్జన్యం.. దాడులు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజే చేయిస్తున్నారంటూ బాధితుల ఆరోపణ
ఉండి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో దళితులపై అమానుష దాడి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రులోని దళితుల శ్మశాన వాటికలో పక్క గ్రామానికి చెందిన ఆక్వా రైతుల కోసం ఆగమేఘాలపై రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న దళితులపై పోలీసులు విచక్షణా రహితంగా విరచుకుపడ్డారు. రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులను దళితులు ఇటీవల పలుమార్లు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. దీంతో.. బుధవారం పొక్లెయిన్‌తో ఒక్కసారిగా సర్వే బృందాలు, నలుగురు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు పెద్దఎత్తున రంగంలోకి దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
దళితులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని తోసుకుంటూ ముందుకెళ్లారు. ముఖ్యంగా దళిత మహిళలపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ముందుగా దళితులను రెచ్చగొట్టి వారు గొడవపడేలా చేసి వారిపై మహిళా పోలీసులను ఉసిగొల్పి ఆపై కానిస్టేబుళ్లను రంగంలోకి దించి వారిని కొట్టడం, దారుణంగా నెట్టేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మహిళా పోలీసులను పంపించి దళిత మహిళలపై దాడిచేసేలా పోలీసులు వ్యూహం రచించారు. అంతేకాక.. మహిళా పోలీసులు వారి వ్రస్తాలు లాగేందుకు బరితెగించారు.
అయినా దళితులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోరాడుతూనే ఉన్నారు. దీంతో.. పోలీసులు సర్వే బృందాలను రెండుగా విభజించి ఒక బృందం స్థానికంగా ఉండేలా.. మరో బృందం కోలమూరు మీదుగా శ్మశానం చివరకు చేరుకుని ఆ వైపు నుంచి సర్వేచేసేలా పథకం రచించారు. ఇది గమనించిన దళితులు అక్కడికెళ్లి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఒక దశలో విద్యుత్ మీటర్లను పట్టుకుని.. రోడ్డు వేయడం నిలిపివేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతామంటూ దళితులు హెచ్చరించారు.
దారుణంగా కొట్టడంతో..
సర్వే బృందాలను దళితులు అడ్డుకోవడంతో పోలీసులు నేరుగా దాడికి దిగారు. తేలి వెంకట్రావు అనే వ్యక్తిని ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా దారుణంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఎస్సైతో పాటు మరో ఏఎస్సై, కానిస్టేబుల్ కూడా అతడిపై దాడిచేసి పక్కనే వున్న బోదెలోకి తోసి కాళ్లతో తొక్కినట్లు దళితులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితికి చేరిన బాధితుడిని దళితులు పాములపర్రు రాష్ట్రీయ రహదారిపైకి తీసుకొచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.
అంతకుముందే.. ధర్నా చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన పరదేశి అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోవడంతో అతడ్ని కూడా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఇతర మండలాల నుంచి పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగారు. అయితే, తాడోపేడో తేల్చేసుకుంటామంటూ ఇటు దళితులు, అటు సర్వే, పోలీసు అధికారులు పాములపర్రులోని శ్మశానం వద్దే మకాం వేసారు.
డిప్యూటీ స్పీకర్ ప్రోద్బలంతోనే..
ఇదిలా ఉంటే.. దళితులపై దాడులకు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మా శవాలపై రోడ్డు వేయాలని, అప్పుడుగాని ఎమ్మెల్యేకి సంతోషంగా ఉండదేమో అని ఆందోళనకారులు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామానికి చెందిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురిచేయడంతో వారంతా తమకు సహకరించడంలేదని ఆవేదన చెందుతున్నారు.