చందమామా.. టాటా..! | Artemis 2 returns to Earth today after completing a 10 day space journey | Sakshi
Sakshi News home page

చందమామా.. టాటా..!

Apr 11 2026 3:38 AM | Updated on Apr 11 2026 3:38 AM

Artemis 2 returns to Earth today after completing a 10 day space journey

చంద్రుడి వైపు నుంచి భూమి వైపు దూసుకు వస్తున్న క్రూ మాడ్యూల్‌ (ప్రతీకాత్మక చిత్రం)

10 రోజుల అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకుని నేడు భువికి అర్టిమిస్‌–2   

 చంద్రుడి చుట్టూ పరిభ్రమించి ఎన్నో అంశాలపై అధ్యయనం

సూళ్లూరుపేట: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం ఈనెల 1న భూమి నుంచి నింగి వైపునకు దూసుకెళ్లిన అర్టిమిస్‌–2 వ్యోమగాముల క్రూమాడ్యూల్‌ చంద్రుడి చుట్టూ పరిభ్రమించి ఎన్నో విశేషాలను అధ్యయనం చేసి తిరుగు ముఖం పట్టింది. పది రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుని భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో శాండియాగోలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ఐదు దశల్లో దిగనుంది.

చంద్రగ్రహంపై మనిషి జీవించే పరిస్థితి ఉందా? లేదా? అని పరిశీలించడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు– రీడ్‌ వైస్‌మన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టీనా కోచ్, జెరెమీ హాన్సెస్‌ చంద్రుడిపై పరిశోధనలు చేశారు.  కాగా,  పదిరోజులు చంద్రుడి చుట్టూరా పరిభ్రమించిన ఈ నలుగురు వ్యోమగాములు చంద్రుడికి అవతల నుంచి సూర్యగ్రహణాన్ని స్వయంగా వీక్షించడం విశేషం. 

అనుక్షణం ఆసక్తికరం. ఉత్కంఠభరితం 
శూన్యంలో భారం లేని స్థితి (మైక్రో గ్రావిటీ) నుంచి భూమిపైన ఉన్న గురుత్వాకర్షణ, మధ్యలో భయంకరమైన వేడి, ఉన్నట్టుండి బరువు పెరిగామన్న భావన, (జీ–ఫోర్సెస్‌), ప్యారాచూట్ల వినియోగం, నలుగురు వ్యోమగాములున్న క్యాప్యూల్‌ సముద్రంలో పడే ప్రక్రియ అంతా అత్యంత ఆసక్తికరం. ఉత్కంఠభరితం. ఈ కారణంగానే వందలాది మంది శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. 

భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందు సర్వీస్‌ మాడ్యూల్‌ అంటే ప్రొపల్షన్, సోలార్‌ ప్యానెల్స్‌ ఉన్న భాగం విడిపోతుంది. క్రూ మాడ్యూల్‌  మాత్రమే ధ్వని వేగం కంటే 32 రెట్లు ఎక్కువగా గంటకు 40 వేల కిలోమీటర్ల భయంకరమైన వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుంది. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో క్రూమాడ్యూల్‌ ముందుభాగం (హీట్‌షీల్డ్‌) 2,800 సెంటీగ్రేడ్స్‌ వరకు వేడెక్కి అగ్నిగోళంలా మారుతుంది. బయటి పొరలు మాత్రమే మండుతాయి. లోపల వ్యోమగాములు సురక్షితంగా ఉంటారు. 

అసలు ఉత్కంఠ అంతా ఇక్కడే వుంటుంది. గాలి, ఒత్తిడి క్రూమాడ్యూల్‌కు గట్టిగా బ్రేక్‌లు వేస్తుంది. ఈ సమయంలో భూమిపై వున్న శాస్త్రవేత్తలకు, వ్యోమగాములకు మధ్య కమ్యూనికేషన్‌ పూర్తిగా కట్‌ అవుతుంది. సుమారు పది నిమిషాల పాటు వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారా! లేదా! అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే దీన్ని భయంకరమైన ఘడియలు (మినిట్స్‌ అప్‌ టెర్రర్‌) అని అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత.. కొంత దూరం అంటే 24,000 అడుగులు ఎత్తులో ఫార్వర్డ్‌ బే కవర్‌ విడిపోతుంది. ఆ తరువాత రెండు డ్రోగ్‌ పారాచూట్ల సాయంతో వేగం 160 కిలోమీటర్లకు తగ్గుతుంది.

చివరలో మూడు పైలట్‌ ప్యారాచూట్లు, ఆ తరువాత మరో మూడు పెద్ద మెయిన్‌ ప్యారాచూట్లు కలిసి వేగాన్ని 32 కిలోమీటర్లకు తగ్గించి పసిఫిక్‌ మహాసముద్రంలో శాండియాగో తీరానికి దగ్గరగా సురక్షితంగా స్ప్లై డౌన్‌ అవుతుంది. అక్కడ స్టీమర్లలో ఉన్న నౌకాయాన సిబ్బంది, నాసా శాస్త్రవేత్తలు క్రూమాడ్యూల్‌లో ఉన్న వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారిని జాన్‌సన్‌ స్పేస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వైద్యసేవలు అందిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement