AP: అసంతృప్తిగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ చర్చలు | APSRTC JAC Discussion With Govt Officers end on a note of dissatisfaction | Sakshi
Sakshi News home page

AP: అసంతృప్తిగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ చర్చలు

Jul 6 2026 4:03 PM | Updated on Jul 6 2026 4:54 PM

APSRTC JAC Discussion With Govt Officers end on a note of dissatisfaction

విజయవాడ:  అధికారులతో జరిగిన ఏపీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. ఆర్టీసీ అదికారుల నుంచి ఎలాంటి హామీలు రాకపోడంతో జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చలు మొక్కుబడిగా జరగడంపై జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. 

చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ వై శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో చర్చలు అన్నారు. కానీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్నే అధికారులు మాకు వివరించారు. 

ఎలక్ట్రికల్ బస్సులకు మేం వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి. తక్షణమే నాలుగువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. చర్చలలో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. జేఏసీ నిర్ణయించిన మేరకు రెండవ దశ ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తాం. జేఏసీ పిలుపు మేరకు నిరసనలను అందరూ విజయవంతం చేయాలి’ అని పేర్కొన్నారు.

మరో జేఏసీ నేత దామోదర్‌ మాట్లాడుతూ.. ‘సమావేశం మొక్కుబడిగా సాగింది. జేఏసీ డిమాండ్ మేరకు స్పెషల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం అంటే ఆనందించాం. కానీ స్పెషల్ సీఎస్ లేకుండానే చర్చలు జరిగాయి.  ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. మూసివేసిన డిపోలను మళ్లీ తెరిపించాలి. ఆర్టీసీని కాపాడుకోవడానికే మా పోరాటం. విద్యుత్ బస్సులు వస్తే రిక్రూట్ మెంట్ ఉండదు.

ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించాలనుకుంటే ఊరుకోం. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి. స్త్రీశక్తి పథకం రీయింబర్స్ మెంట్ కు ప్రభుత్వం రూ. 300 కోట్లు ఇవ్వాలి. కానీ నెలకు 160 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. మొత్తం రూ. 300 కోట్లను ఆర్టీసీకి ఇస్తే మేమే ఎలక్ట్రికల్ బస్సులు కొని నడిపించుకుంటాం. రేపట్నుంచి మా డిమాండ్లను నిరసనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళతాం. ఈ నెలాఖరుకి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.  ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన విరమించకపోతే ప్రత్యక్ష ఆందోళన తప్పదు’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement