
పీటీఎం ముగిసినా ఫొటోలు అప్‌లోడ్ చేయాలంటూ ఒత్తిడి
నెట్‌వర్క్ సమస్యతో చాలాచోట్ల అప్‌లోడ్ కాక ఇబ్బందులు
కొన్నిచోట్ల లైవ్ వీడియోలో నాణ్యతలేదు.. మళ్లీ పంపాలని ఒత్తిడి
ఆదివారం సెలవురోజు కూడా అదేపనిలో ఉపాధ్యాయుల మల్లగుల్లాలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డు కోసం ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం–2.0) ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులైనా ఆన్‌లైన్‌లో వివరాలు, ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ కాకపోవడం, అప్‌లోడ్ చేసిన వాటిలో నాణ్యతలేదని చెప్పి మళ్లీ క్వాలిటీతో అప్‌లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమ వీడియోలు అప్పుడు వచ్చిన వారెవరైనా తీశారా అని ఆరాతీస్తూ ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
గిన్నిస్ రికార్డు కోసం ఏర్పాటుచేసిన ఈ పీటీఎం సమావేశాలు విఫలమవడంతో ఎలాగైనా లక్ష్యం సాధించేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో.. నాలుగు రోజులుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నిద్రహారాలు లేకుండా చేస్తున్నారు. పైగా.. ఆదివారం సెలవు అయినప్పటికీ ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చి పనిచేయాల్సి వచ్చింది. విట్‌నెస్ ద్వారా నింపాల్సిన గిన్నిస్ రికార్డు గూగుల్ డ్రైవ్ ఫారం ఎలా నింపాలో తెలీక కొందరు, నెట్‌వర్క్ పనిచేయక మరికొందరు పూర్తిచేయలేకపోయారు.