తరలింపును సంఘాలేవీ వ్యతిరేకించట్లేదు | AP Secretariat Employees Union Implied Petition in High Court | Sakshi
Sakshi News home page

తరలింపును సంఘాలేవీ వ్యతిరేకించట్లేదు

Jul 29 2020 4:14 AM | Updated on Jul 29 2020 4:14 AM

AP Secretariat Employees Union Implied Petition in High Court - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ  వ్యతిరేకించడం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. ప్రజల్లో తమ సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తూ సమితి పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. రాజధాని తరలింపు వల్ల ఖజానాపై రూ.5,116 కోట్ల మేర భారం పడుతుందన్న వాదనలో వాస్తవం లేదని, ఇందులో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ మంగళవారం  అనుబంధ పిటిషన్‌ వేశారు. ఆ వివరాలివీ...

మాకెలాంటి ఆశ చూపలేదు...
► పలు ప్రయోజనాలను ఆశగా చూపి తరలింపు విషయంలో పురపాలకశాఖ ఉద్యోగులను ఒప్పించినట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌లో పేర్కొనటాన్ని ఖండిస్తున్నాం. విశాఖకు తరలింపు విషయంలో ప్రభుత్వం మాకెలాంటి ప్రయోజనాలను ఆశగా చూపలేదు. ఈ ఏడాది మార్చి 18న జరిగిన ఉద్యోగుల సంఘం సమావేశంలో తరలింపు ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉంటుంది? పిల్లల చదువులపై చర్చ జరిగింది. తరలిం పుపై ప్రభుత్వం మాకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమితి పేర్కొనడం  అబద్ధం.

ఇళ్ల స్థలాలు ఆనవాయితీ....
► ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై రూ.5,116 కోట్ల భారం పడుతుందన్న సమితి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడమే. రూ.2 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందునే ఉద్యోగులు తరలింపుపై అంగీకరించారని సమితి మాపై ఆరోపణలు చేసింది. కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు  ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనవాయితీ. గత సర్కారు అమరావతిలో ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులకు 500 గజాల చొప్పున స్థలం ఇచ్చింది.
 
రూ.70 కోట్లకు మించదు...
► ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడం వల్ల రూ.2,500 కోట్లు నష్టం వాటిల్లుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చింది. సర్వీసును బట్టి ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ.12 లక్షల గృహ రుణం పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాల్లో ఇది భాగం. ఉద్యోగి బదిలీ అయినప్పుడు రవాణా, షిఫ్టింగ్‌ భత్యం ఇస్తారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం కూడా చెల్లించింది. తరలింపు ఖర్చు రూ.70 కోట్లకు మించదు.
► గత ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా 62 ప్రాజెక్టుల కోసం రూ.52,837 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించిందని  సమితి చెబుతోంది. రూ.11 వేల కోట్లతో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది.  20 శాతం నిధులతో 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పడం విస్మయం కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement