ధాన్యం రైతు ‘ధర’హాసం

AP: Reasonable Prices For Cultivation Of Rice In The Market - Sakshi

మార్కెట్‌లో వరికి గిట్టుబాటు ధరలు

గతేడాది క్వింటా రూ.1,700.. ఈ ఏడాది రూ.2,900

వేరుశనగ, మిరప పంటలకు దీటుగా  ధాన్యం కొనుగోళ్లు

అన్నదాతల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

ఎమ్మిగనూరు(కర్నూలు జిల్లా): వరి సాగు ఈ ఏడాది రైతుకు కలిసొచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. వేరుశనగ, మిరప పంటలకు దీటుగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 31,402 హెక్టార్లు. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించటం, ప్రాజెక్టుల్లో విస్తారంగా సాగునీరు లభ్యంకావటంతో కేవలం ఖరీఫ్‌లోనే 28,651 హెక్టార్లలో వరి సాగైంది. రబీలో కూడా కాలువల కింద రైతులు ఈ పంటను సాగు చేసుకొన్నారు.

ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టగా.. 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడులొచ్చాయి. గతేడాది క్వింటా ధర రూ.1,700 పలికింది. ఈ ఏడాది ఆరంభం(జనవరి)లో కర్నూలు సోనా క్వింటా రూ.2,000, ఆరున్నర రకం(చిన్నసోనా), ఎన్‌డీఎల్‌(నంద్యాలసోనా) రకాలు క్వింటాల్‌ రూ.2,300 వరకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.2,900 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు.  ఫిబ్రవరి నెలాఖరుకు రూ. 3,000 మార్కును అందుకోనుందని వ్యాపారులు చెబుతున్నారు.  

ప్రభుత్వ తోడ్పాటు   
ఖరీఫ్‌ పంట దిగుబడులను రైతులు వెంటనే అమ్ముకోకుండా అధిక ధరలు వచ్చే వరకూ వేర్‌హౌజ్‌ల్లో నిల్వచేస్తున్నారు .రైతుల అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 95 గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా రైతులు నిల్వచేసుకొన్న పంటకు బ్యాంకులతో రుణాలు మంజూరు చేయిస్తోంది. కొంతమంది వేర్‌హౌజ్‌ యజమానులు కూడా వరి బస్తాకు రూ.1,000 చొప్పున రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తీరుతున్నాయి.   

క్వింటా బియ్యం రూ.4500 
మార్కెట్‌లో క్వింటా బియ్యం రూ.4500 పలుకుతోంది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న శిక్షణలతో రైతుల్లో చైతన్యం మొదలైంది. పంట అమ్మకాల్లో గత కొంతకాలంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాము పండించించిన పంట ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చుతున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లోని రైసు మిల్లులకు రైతులు వరిధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలుసోనా బియ్యం క్వింటా రూ.4300, నంద్యాల సోనా, సన్నబియ్యం రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. 

రైతుకు మంచికాలం  
రైతులకు మంచి కాలం నడుస్తోంది. పంటలకు రేట్లు బాగున్నాయి. ఎప్పుడూ రూ1,800 దాటని వడ్లు ఈఏడు రూ.2,900 అమ్ముతున్నాయి. నేను పది ఎకరాల్లో నంద్యాల సోనా రకం సాగు చేశా. 400 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2900 చొప్పున విక్రయించా.  
–ఎన్‌ పరమేష్, గురుజాల గ్రామం

గతంలో ఇంత రేటు లేదు 
తుంగభద్ర నది పంపుసెట్ల కింద 2.5 ఎకరాల్లో కర్నూలు సోనా పండించా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా  రూ.2800 చొప్పున అమ్ముకొన్నా. గతంలో ఎప్పుడూ ఇంత రేటు లేదు. మంచి ధర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 
– కురువ కిష్టప్ప,వరి రైతు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top