సూడాన్‌లో దోచుకుంటున్నారు.. బతికి ఉండే పరిస్థితుల్లేవ్‌: చీరాలవాసి

AP Man Explained Sudan Worst Situation Express Thanks CM Jagan - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్‌లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్‌ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్‌గా..  ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్‌లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ..

‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో  ఆరేళ్ల కిందట సూడాన్‌ వెళ్లాను. ఓ సెరామిక్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. 

‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా  భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి  చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్‌ చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్‌ఆర్టీఎస్‌ రంగంలోకి దిగింది. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. 

హెల్ప్‌లైన్‌ నెంబర్లు.. 
0863 2340678
వాట్సాప్‌ నెంబర్‌ 85000 27678 

ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top