ముగిసిన వీర జవాన్‌ జశ్వంత్‌ అంత్యక్రియలు

AP: Jawan Jaswant Reddy Dead Body Reached To Bapatla - Sakshi

సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జశ్వంత్‌రెడ్డిని కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య జశ్వంత్‌కు వీడ్కోలు పలికారు. నేడు ఆయన భౌతికకాయం సొంత గ్రామానికి చేరుకుంది. జశ్వంత్‌ రెడ్డి అంత్యక్రియలు దరివాడ కొత్తపాలెంలో అధికారిక సైనిక లాంఛనాలతో నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం వద్ద  ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. 

కాగా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి (23) అమరుడైన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అమర జవాన్‌ జశ్వంత్‌ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండంగా నిలించింది. వీరజవాన్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 

2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top