సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌‌పై హైకోర్టు విచారణ

AP High Court Trail On Social Media Postings - Sakshi

సోషల్‌ మీడియా పోస్టుల్లో ప్రభుత్వానికి సంబంధం లేదు : ఏజీ

సాక్షి, అమరావతి : న్యాయస్థానంపై సోషల్‌ మీడియా వేదికగా వెలుగుచూసిన పోస్టింగులపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కోర్టుపై వ్యాఖ్యలు చేసిన వారికి మంత్రి పదవులు ఇస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులపై పోస్టులు పెట్టిన వారికి గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాలివ్వాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌,  సీఐడీ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టులపై వ్యాఖ్యలు చేసేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభిప్రాయంపై ఏజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొట్టిపారేశారు. టీడీపీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన శివానందరెడ్డికి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే అర్హతలేదని వాదించారు. (అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా?)

హైకోర్టులు మూసేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ నుంచి రావడం సరికాదన్నారు. ఇలాంటి వాటికి న్యాయ, రాజ్యాంగ ప్రక్రియల్లో చోటు లేదన్నారు. న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని,  సోషల్‌మీడియా పోస్టుల వెనుక ప్లాన్‌ ఉందడానికి దాఖలాలు లేవని వివరించారు. ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వానికి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలనా వ్యవస్థనుంచి ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. (న్యాయమూర్తులపై పోస్టులను తొలగించండి)

న్యాయమూర్తులన్నా, కోర్టులన్నా తమకు అత్యంత గౌరవం ఉందని ఏజీ శ్రీరామ్‌, నిరంజన్‌రెడ్డి తెలిపారు. కోర్టు ఎవరైనా వ్యక్తులపై ఆరోపణలు చేసినప్పుడు వారిని పార్టీలుగా చేయాలని, వారి వాదనలు వినాలని కోరారు.న్యాయస్థానంపై సోషల్‌ మీడియా పోస్టుల వెనుక ఏదో కోణం ఉందన్న ఆలోచన అనవసరమని కొట్టిపారేశారు. మరోవైపు సీఐడీ విచారణ సరిగా చేయడం లేదంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.స్పీకర్‌, కొందరు మంత్రులు, ఎంపీలు వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా హైకోర్టుపై దాడిగానే పరిగణించాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌పై వాదనలు వినిపించి ఏజీ శ్రీరాం... న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయితే సోషల్‌ మీడియా పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్న స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని కోరారు.

ప్రభుత్వం, సీఐడీలపై హైకోర్టు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు, అభిప్రాయాలు, ఫైండింగ్స్‌ చెప్పని పక్షంలో సీబీఐకి అప్పగించేందు తమకు ఎలాంటి అభ్యంతరంలేదని న్యాయస్థానానికి ఏజీ విన్నవించారు. అయితే సోషల్‌ మీడియా సంస్థలు బహుళదేశాల్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థతో విచారణపై పరిశీలన చేస్తామని హైకోర్టు అభిప్రాయడింది. దీనికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ పేర్కొన్నారు. కాగా న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులను చట్ట ప్రకారం తొలగించాలని హైకోర్టు మంగళవారం ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ను ఆయా కంపెనీలకు అందచేయాలని సీఐడీకి సూచించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top