
సాక్షి,విజయవాడ: పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అరెస్ట్ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.
వర్రా రవీందర్‌రెడ్డిని 2024 నవంబర్ 8న అరెస్ట్ చేసి నవంబర్ 10న అరెస్ట్ చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది.
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్‌లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్ 3(5) బిఎన్‌ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్‌మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.
