
ఏపీ హైకోర్టు: సంక్షేమ హాస్టళ్ళ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు పైన దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మండిపడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
సంక్షేమ హాస్టల్లో పిల్లల అవస్థలు మీకు కనిపించడం లేదా?.కటిక నేలపై పిల్లలు ఎలా పడుకుంటారు? పిల్లల్ని మనం మన ఇళ్ల వద్ద అలాగే పడుకో బెట్టుకుంటున్నామా..?. కనీసం సన్నపాటి పరుపు, దుప్పటి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా..? బడ్జెట్ కేటాయింపులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నించిన హైకోర్టు..కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అని దుయ్యబట్టింది.
పిల్లల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన హైకోర్టు..ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి స్థాయిలో తనిఖీలు చేయాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నివేదికలను ప్రతినెలా మా ముందు ఉంచండి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడే సమస్య లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సాంఘిక,బీసీ, గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శిను బాధితులుగా చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలపై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆన్‌లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు.