రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు

AP High Court says Capital lands should not be used for other purposes - Sakshi

హైకోర్టులో అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు

ప్రభుత్వ, సీఆర్‌డీఏ వాదనల నిమిత్తం విచారణ 29కి వాయిదా

సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని అన్నారు.

సీఆర్‌డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్‌డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై  జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్‌ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top