పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వండి

AP High Court hearing On MPTC And ZPTC Elections Petition - Sakshi

టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే ఎన్నికలు పెట్టడం లేదు

ఎన్నికలు పూర్తి చేయకుండా నిమ్మగడ్డ సెలవుపై వెళుతున్నారు

ఇది రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకోవడమే

ఎన్నికల పూర్తికి 6 రోజులు చాలు

హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్, వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌

తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో, టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించేందుకు  ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందులో ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు గురువారం విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్‌ గత ఏడాది మార్చి 15న నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం చాలాచోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయని వివరించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి పంచాయతీ, పురపాలక ఎన్నికలను పూర్తి చేశారని వివరించారు. కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా.. ఎన్నికల కమిషనర్‌ నిర్వహించడం లేదన్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు. అయితే ఎన్నికలు పెట్టకుండా ఎస్‌ఈసీ ఈ నెల 19 నుంచి 22 వరకు వ్యక్తిగత సెలవుపై వెళుతున్నారని, ఇది రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే అవుతుందని వివరించారు.

ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాక దానిని తార్కిక ముగింపునకు తీసుకురావాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని వివరించారు. ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం కంటే టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎక్కువ ప్రాధాన్యతనిÜ్తున్నారని వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ లోపు ఎన్నికలు పూర్తి చేస్తే, కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేవలం 6 రోజులు సరిపోతాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఎన్నికల కమిషన్‌ వివరణ కోరింది. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ స్పందిస్తూ.. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top