హెచ్‌ఆర్‌సీని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు: ఏపీ హైకోర్టు

AP HC Clarifies Government Over Setup Of HRC Anywhere - Sakshi

అది ప్రభుత్వ విశేషాధికారం 

ఫలానా చోటే ఏర్పాటు చేయాలని ఆదేశించలేం 

స్పష్టం చేసిన హైకోర్టు.. 

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 27కి వాయిదా 

సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను (హెచ్‌ఆర్‌సీని) రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసే విశేషాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫలానా చోటునే హెచ్‌ఆర్‌సీని ఏర్పాటు చేయాలని చెప్పలేమంది. తెలంగాణలో కాకుండా మన రాష్ట్ర భూభాగంలో హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పామని హైకోర్టు గుర్తుచేసింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అమరావతిలో హెచ్‌ఆర్‌సీని ఏర్పాటు చేస్తూ 2017లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరించి కర్నూలులో ఏర్పాటుకు తాజా నోటిఫికేషన్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వివరించారు.

హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకు వీలుగా కర్నూలులో రెండు ప్రాంగణాలను హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యులు పరిశీలించారని, అవి అనువుగా లేకపోవడంతో కొత్త ప్రాంగణాన్ని చూస్తున్నారని తెలిపారు. హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు విషయంలో పురోగతిని తెలిపేందుకు విచారణను ఓ నెలపాటు వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ విచారణను సెప్టెంబర్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం తెలంగాణలో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయడం దూరాభారం అవుతుందని పిటిషనర్‌ న్యాయవాది పొత్తూరి సురేష్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top