సింహగిరి నుంచి  తిరునగరి వరకు..

AP Govt measures for the development of spiritual tourism - Sakshi

ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు.. 

100 దేవాలయాలతో జాబితా సిద్ధం చేసిన పర్యాటక శాఖ

16 సర్క్యూట్లుగా ఆలయాల విభజన

తొలిదశలో 5 సర్క్యూట్లలో పైలట్‌ ప్రాజెక్ట్‌

సారూప్యత కలిగిన ఆలయాలను దర్శించేలా యాత్రల రూపకల్పన 

రెలిజియస్‌ టూరిజం కింద ప్రత్యేక ప్యాకేజీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం(టెంపుల్‌ టూరిజం) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సారూప్యత కలిగిన దేవాలయాలను అనుసంధానం చేస్తూ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. అలాగే పర్యాటకులు ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్నచిన్న పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 100 దేవాలయాలతో జాబితా రూపొందించింది. వీటిని 16 సర్క్యూట్లుగా విభజించి.. ఒక్కో సర్క్యూట్‌లో 3 నుంచి పదికి పైగా ఆలయాల దర్శనాన్ని కల్పించనుంది. దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత 5 సర్క్యూట్లలో అమలు చేయనుంది. ఈ సర్క్యూట్ల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తోంది.  

ప్రజలకు భగవంతుడిని మరింత చేరువ చేసేలా .. 
రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలున్నాయి. వీటిని పర్యాటకంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రెలిజియస్‌ టూరిజం కింద ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్త సర్క్యూట్లతో పాటు జిల్లాల పరిధిలోనూ దర్శనీయ స్థలాలను చుట్టివచ్చేలా వీలు కల్పించనుంది. ఒకటి నుంచి మూడు రోజుల పాటు యాత్ర కొనసాగేలా ప్యాకేజీలను రూపొందిస్తోంది.

రవాణా, వసతి సౌకర్యాలతో పాటు భగవంతుడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేందుకు.. ఆలయాల వారీగా ప్రత్యేక వెబ్‌పోర్టల్స్, మొబైల్‌ అప్లికేషన్లను పర్యాటక శాఖ వినియోగించనుంది. భక్తులు, పర్యాటకులకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు ఎంపిక చేసిన ఆలయాల వద్ద రిలీజియస్‌ టూరిజం ఇన్ఫర్మేషన్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

సుమారు 500 నుంచి 1,000 చదరపు అడుగుల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వీటిని నిరి్మంచనుంది. ఇందులో ప్రత్యేక డిస్‌ప్లేలు, కియోస్‌్కల ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్త ఆలయాల సమాచారం అందుబాటులో ఉంచుతారు. ఆలయాల విశిష్టతను వివరించేందుకు గైడ్లు కూడా ఉంటారు.   

భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపేలా.. 
మన రాష్ట్రంలో ఎన్నో విశిష్ట దేవాలయాలున్నాయి. వీటికి పర్యాటక ప్రాంతాలను అనుసంధానించి.. మన రాష్ట్రంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణాన్ని అందించనున్నాం. ఇందులో భాగంగా రెలిజియస్‌ టూరిజాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రజల అభీష్టానికి అనుగుణంగా దేవాలయాల సందర్శన యాత్రల ప్యాకేజీలను తీసుకొస్తాం. 
– ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top