ప్రకృతి సేద్యం.. ఎస్సీ రైతులకు ప్రోత్సాహం

AP Govt May Give Incentive To SC Farmers Doing Natural Farming - Sakshi

కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న ఎస్సీ రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కార్యాచరణ ఖరారైంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 71,560 మంది ఎస్సీ రైతుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మొత్తంలో రూ.10 వేలు సబ్సిడీ, రూ.40 వేలు రుణంగా ఇవ్వనున్నారు. సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా మూడు విడతల్లో ఎస్సీ రైతులకు ఈ రుణాలను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 8,198 మందికి, రెండో విడతలో 34,100 మందికి, మూడో విడతలో 29,262 మందికి అందించనున్నారు. ఆ మొత్తాలను ఎస్సీ రైతులు ప్రకృతి సేద్యానికి పెట్టుబడిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ రైతు కుటుంబంలో మహిళల పేరిట రుణాలు మంజూరు చేస్తారు. ఎస్సీ కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

శిక్షణతోపాటు పరికరాలూ ఇస్తాం 
ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.  రైతు సాధికార సంస్థ, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమన్వయంతో కార్యాచరణకు సహకరిస్తాయని తెలిపారు. సబ్సిడీ రుణాలే కాకుండా ప్రకృతి సేద్యంలో శిక్షణ ఇస్తామన్నారు.  పంట రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాల కోసం వినియోగించే వాహనాలను రాయితీలపై అందిస్తామని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top