చికిత్స.. పక్కా లెక్క | Sakshi
Sakshi News home page

చికిత్స.. పక్కా లెక్క

Published Sun, Nov 29 2020 5:02 AM

Ap Govt hospitals get National Quality Assurance Standards - Sakshi

సాక్షి, అమరావతి:  రోగి ఆస్పత్రికి వెళితే చిత్తు కాగితం మీద కూడా మందులు రాసిన సందర్భాలు అనేకం. కేస్‌ షీట్లు రాసేందుకు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో పేపర్లు ఉండేవి కావు. ఇదంతా గతం. ఇప్పుడు కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలోనే  ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నిర్వహణ జరుగుతోంది. ఎన్‌క్యూఏఎస్‌ (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌) ప్రమాణాల మేరకు ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ రిజిస్ట్రీ నిర్వహిస్తారు.

ప్రతి పేషెంట్‌కు సంబంధించిన వివరాలు నిబంధనల మేరకు రిజిస్ట్రీ (నమోదు) అవుతాయి. గతంలోలా కాకుండా ఓపీ, ఐపీ స్లిప్పులూ మారనున్నాయి. ఇన్‌ పేషెంట్‌కు సంబంధించి ఏకంగా 16 పేజీల పుస్తకం నిర్వహిస్తారు. ఎవరు ఎలాంటి వైద్యం చేశారు.. ఏం మందులు రాశారు.. ఏయే రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు వంటి వివరాలన్నీ ఈ కేస్‌ షీట్‌లో ఉంటాయి. ఒక్కసారి ఇన్‌ పేషెంట్‌గా చేరిన వ్యక్తి సమాచారం మొత్తం ఈ పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ నాణ్యతా ప్రమాణాలు..
► ప్రస్తుతం రాష్ట్రంలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్‌ (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌) మదింపు జరుగుతోంది. ఈ ప్రమాణాలను అందుకోవాలంటే ఆస్పత్రుల్లో ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఓపీ, ఐపీ స్లిప్పులు, రిజిస్ట్రీలో భారీగా మార్పులు తెచ్చారు.

► దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్‌క్యూఏఎస్‌ మదింపు పరిధిలోకి ఇన్ని ఆస్పత్రులను తీసుకురాలేదు. ఏపీలో మాత్రమే ఈ విధానంతో ముందుకెళుతున్నారు. ఎన్‌క్యూఏఎస్‌ ప్రమాణాల మదింపు సుమారు 90 రకాల సేవలకు సంబంధించి చేస్తారు. ఇందులో ఓపీ..ఐపీ ప్రధానమైనవి.

ఒక పేజీ ఓపీ షీట్, 16 పేజీల కేస్‌ షీట్‌
► తాజాగా ఇన్‌ పేషెంట్‌ షీట్‌ను మార్చారు. ఇందులో జబ్బు వివరాలు, పేషెంట్‌ హిస్టరీ, ఫిజికల్‌ ఎగ్జామినేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ చేసి అందులో రాయాలి.

► కేస్‌ షీట్‌.. 16 పేజీలతో ముద్రించిన పుస్తకం డాక్టర్ల దగ్గర ఉంటుంది. మొదటి పేజీలో పేషెంట్‌ వివరాలు, అంగీకార పత్రం మొదలుకుని అన్ని వివరాలు ఉంటాయి.

► ఇన్వెస్టిగేషన్‌ ఫైండింగ్స్‌.. అంటే రోగ నిర్ధారణ పరీక్షలు చేశాక ఫలితాలు విధిగా రాయాల్సి ఉంటుంది. 3వ పేజీలో రోగి హిస్టరీ అంటే పేషెంట్‌కు దీర్ఘకాలిక జబ్బులున్నాయా.. ఎలాంటి మందులు వాడుతున్నారు, కుటుంబ హిస్టరీ వంటివన్నీ రాస్తారు.

► మెడికల్‌ చార్ట్‌ పేరుతో 5వ పేజీ రూపొందించారు. ఇందులో మందు పేరుతో పాటు డోసు, ఎన్ని వాడాలి, ఏ టైములో వాడాలి అనేది రాసి ఉంటుంది.

► నర్సు ఏ షిఫ్టులో ఎన్నిసార్లు పరీక్షించిందో, సేవలు అందించిందో అనే దానికి ఒక పేజీ కేటాయించారు. రోగికి కౌన్సిలింగ్‌ చేయడం, ఆహారం గురించి చెప్పడం విధిగా రాయాలి.

► డిశ్చార్జి సమ్మరీతో పాటు రోగి చనిపోతే డెత్‌ సమ్మరీ కాపీ ఒకటి ఆస్పత్రి వద్ద ఉంచుకుని, మరొకటి పేషెంట్‌ కుటుంబ సభ్యులకు విధిగా ఇవ్వాలి. ఇందులో విధిగా కారణాలను రాయాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్‌ డేటాలో నిక్షిప్తం చేస్తారు.

Advertisement
Advertisement