తెలుగు గంగ.. ఆయకట్టు మురవంగ

AP Govt has taken steps to fully irrigate above 5 lakh acres under TG Project - Sakshi

టీజీ ప్రాజెక్ట్‌ కింద మరో 1.46 లక్షల ఎకరాలు సాగులోకి..

మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ కార్యాచరణ

ఇప్పటికే ప్రధాన కాలువ లైనింగ్, డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.152.90 కోట్ల వ్యయం

సాక్షి, అమరావతి: తెలుగు గంగ (టీజీ) ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో గల 5.75 లక్షల ఎకరాలకు పూర్తిగా నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కాలువకు లైనింగ్‌ చేయకపోవడం.. బ్రహ్మం సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి. మిగిలిన 1,46,154 ఎకరాలకు నీళ్లందడం లేదు. పెండింగ్‌ పనులను పూర్తి చేయడం ద్వారా నీళ్లందని ఆయకట్టునూ సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఇప్పటికే రూ.152.90 కోట్లను ఖర్చు చేసింది. మిగతా పనులను వచ్చే సీజన్‌లోగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

లక్ష్యం ఇదీ: కృష్ణా, పెన్నా నదుల వరద జలాల్లో 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును  ప్రభుత్వం చేపట్టింది. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున నిర్మించిన లింక్‌ కెనాల్‌కు లైనింగ్‌ చేయకపోవడం.. వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మం సాగర్‌ వరకూ 18 కిలోమీటర్ల పొడవున తవ్విన ప్రధాన కాలువ సక్రమంగా లేకపోవడం, బ్రహ్మం సాగర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 17.745 టీఎంసీలను నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి.

పూర్తి ఆయకట్టుకు నీళ్లందించే దిశగా..
బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్‌ కెనాల్‌ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల 8 వేల క్యూసెక్కులు కూడా ప్రవహించడం లేదు. దాంతో 16.95 టీఎంసీల సామర్థ్యం ఉన్న వెలిగోడు రిజర్వాయర్‌ను వేగంగా నింపలేని దుస్థితి నెలకొంది. వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి తెలుగు గంగ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల కనీసం 3,500 క్యూసెక్కులను కూడా తరలించలేని పరిస్థితి. దాంతో 17.745 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్రహ్మం సాగర్‌ను వేగంగా నింపడం సాధ్యకావడం లేదు.

ఈ నేపథ్యంలో కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచటం ద్వారా రిజర్వాయర్లను శరవేగంగా నింపేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ పనులను పూర్తి చేసి మిగతా 1,46,154 ఎకరాలకు నీళ్లందించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో ఈ కాలువ లైనింగ్‌ పనులను రూ.280 కోట్లతో చేపట్టారు. తెలుగు గంగ కాలువలో ఆగస్టు నుంచి ఏప్రిల్‌ వరకూ నీటి ప్రవాహం ఉంటుంది. 4 నెలలు మాత్రమే పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రబీలో ఆయకట్టుకు క్రాప్‌ హాలిడే ప్రకటించిన అధికారులు.. వేగంగా పనులు చేస్తున్నారు. బ్రహ్మం సాగర్‌ను పటిష్టం చేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసేలా చర్యలు తీసుకంటున్నారు. డిస్ట్రిబ్యూటరీల పనులనూ వేగవంతం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top