ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లకు జవసత్వాలు

AP Govt Grants Permission For Two Oxygen Plants In Anantapur District - Sakshi

రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లకు జవసత్వాలు

వెనువెంటనే అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం

రోజూ 700 సిలిండర్ల సరఫరాకు అవకాశం

జిల్లా అవసరాలకే సగభాగం సిలిండర్లు

గతంలోనే రూ.5 కోట్లతో ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులు 

జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌కు అనుగుణంగా కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్‌ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చించారు. వెనువెంటనే అనుమతులను మంజూరు చేయించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్‌ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్‌ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో ‘సెకెండ్‌ వేవ్‌’ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడటం విశేషం. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్‌ ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత దేశ వ్యాప్తంగా వణుకు పట్టిస్తున్నా.. జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యలు ఫలితాలనిస్తోంది. శింగనమలలోని లైఫ్‌ ఆక్సిజన్‌ ప్లాంటుతో పాటు హిందుపురం నియోజకవర్గంలో తూముకుంట వద్ద ఉన్న సాయికృష్ణ ఆక్సిజన్‌ గ్యాసెస్‌ ప్లాంటులో ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు గుర్తించారు. అయితే ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తికి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేయించారు. తద్వారా ఈ రెండు ప్లాంట్లలో ఏకంగా ప్రతి రోజూ 700 సిలిండర్ల మేర ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందని కలెక్టర్‌ గంధం చంద్రుడు ‘సాక్షి’కి తెలిపారు.

ఉత్పత్తి ప్లాంట్ల సమస్యలకు పరిష్కారం 
వాస్తవానికి ఏదైనా ప్లాంటులో ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి(ఫారం–25) అవసరం. అంతేకాకుండా ఆక్సిజన్‌ రవాణా కోసం కూడా అదే శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే శింగనమలలోని లైఫ్‌ ఆక్సిజన్‌ ప్లాంటుకు ఈ అనుమతులు లేవు. ఫలితంగా సదరు కంపెనీ ఆక్సిజన్‌ ఉత్పత్తిని నిలిపేసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు వెంటనే ఔషధ నియంత్రణశాఖ అధికారులతో మాట్లాడటంతో పాటు అనుమతుల కోసం సదరు కంపెనీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించారు. వెంటనే అనుమతులు వచ్చేలా కృషి చేశారు. ఆ మేరకు ప్లాంటులో 300 సిలిండర్ల మేర ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో 150 నుంచి 200 సిలిండర్లు జిల్లా ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది.

ఇక తూముకుంట వద్దనున్న సాయికృష్ణ ఆక్సిజన్‌ గ్యాసెస్‌ కంపెనీ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిల వల్ల ఈ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ.19 లక్షల విద్యుత్‌ బకాయిలను 18 నెలల పాటు వాయిదా వేయాలని సదరు కంపెనీ అభ్యర్థించింది. దీనిపై వెంటనే ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీతో కలెక్టర్‌ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక్కడ రోజుకు 500 సిలిండర్ల మేర ఆక్సిజన్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా ప్రతి రోజూ జిల్లాలోనే ఏకంగా 700 సిలిండర్ల మేర ఆక్సిజన్‌ అందుబాటులోకి రానుంది. ఇది కాస్తా జిల్లా ప్రస్తుత అవసరాల్లో సగం మేర ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జిల్లాలోనే ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ప్రభుత్వ ముందుచూపుతో.. 
వాస్తవానికి కోవిడ్‌ కంటే ముందు జిల్లాలోని ప్రధాన ఆసుపత్రితో పాటు ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆక్సిజన్‌ నిల్వ కోసం ప్లాంటు లేదు. సరైన ఆక్సిజన్‌ పైపులైన్లు  కూడా లేని దుస్థితి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆక్సిజన్‌ నిల్వ ప్లాంటుతో పాటు రోగులకు నేరుగా ఆక్సిజన్‌ సరఫరా పైపులైన్ల ఏర్పాటుకు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. ఇలా ఏకంగా రూ.5 కోట్లకుపైగా నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వ ప్లాంటుతో పాటు పైపులైన్లను ఏర్పాటు చేశారు. 

మరో 100 టన్నుల ఆక్సిజన్‌ 
జిల్లాలో అర్జాస్‌ స్టీల్‌ కంపెనీ ఉంది. తన పరిశ్రమ అవసరాల కోసం ఈ కంపెనీ ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుకుంది. ఇక్కడ సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా జిల్లా కలెక్టర్‌ ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఆక్సిజన్‌ను కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఆక్సిజన్‌ నిల్వలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సగం ఆక్సిజన్‌ ఇక్కడి అవసరాలకే.. 
జిల్లాలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్లాంట్లను గుర్తించాం. రెండు ప్లాంట్లపై దృష్టి సారించాం. అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌తో జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్‌ అవసరాల్లో సుమారు సగం మేర తీరే అవకాశం ఉంది. 
– గంధం చంద్రుడు, కలెక్టర్‌
చదవండి:
అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..   
ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top