వలస కూలీలకు భరోసా

AP Govt Assurance to migrant workers - Sakshi

వారు వెనక్కి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

లాక్‌డౌన్‌ ఉండదని కంపెనీల యజమానులకు స్పష్టత 

కోవిడ్‌ ప్రోటోకాల్‌ అనుసరిస్తూ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడి

సొంత క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్న కంపెనీలు  

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించే వలస కూలీలను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది లాక్‌డౌన్‌తో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అన్ని చోట్లా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా రాష్ట్ర పారిశ్రామిక రంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు లేవని, కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చంటూ పారిశ్రామికవేత్తలకు భరోసాను కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా టెక్స్‌టైల్, గ్రానైట్, నిర్మాణ రంగాల కార్యకలాపాల్లో లక్షలాది మంది వలస కూలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటనలు వస్తుండటంతో రాష్ట్రంలోని యాజమాన్యాలు, వలస కూలీల్లో ఒకరకమైన అభద్రతా భావం నెలకొని ఉన్న విషయం గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పనిచేసే చోట కోవిడ్‌ నిబంధనలు ఎలా పాటించాలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలి వెళ్లిపోతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక క్వారంటైన్లు..
లాక్‌డౌన్‌ తర్వాత గత నవంబర్‌ నెల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ దెబ్బతో వలస కూలీలు మారోమారు వెళ్లిపోకుండా ఉండటానికి యాజమాన్యాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం యూనిట్లలో పనిచేసే కూలీలకు ప్రత్యేక వైద్యం, వసతిని ఏర్పాటు చేస్తున్నాయి. కూలీల్లో ఎవరికైనా కోవిడ్‌ సోకితే వారి నుంచి ఇతరులకు విస్తరించకుండా ఉండటం కోసం పరిశ్రమల్లోనే ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు దండ ప్రసాద్‌ తెలిపారు.

మార్చి నెల నుంచి వలస కూలీల్లో ఆందోళన మొదలైనప్పటికీ ఇంత వరకు ఎవ్వరూ వెనక్కి వెళ్లలేదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీ స్మాల్‌ స్కేల్‌ గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వై.కోటేశ్వరరావు తెలిపారు. గత లాక్‌డౌన్‌ సమయంలో తిరిగి వెళ్లిపోయిన వలస కూలీల్లో 65 శాతం మంది వెనక్కి వచ్చారని, ఇప్పుడు వారు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top