సర్వే రికార్డే ఇక ఆర్‌ఎస్‌ఆర్‌ 

AP Govt Another Step For land resurvey program more rapidly - Sakshi

రీసర్వే వేగం పెంచేందుకు కొత్త మార్పు 

ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ రూల్స్‌కు సవరణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్‌నే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణించేలా ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ రూల్స్‌కు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రీసర్వేలో భాగంగా రెవెన్యూ శాఖ ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)లో ఫారమ్‌–1 తయారు చేయాలి.

అందుకోసం ఆర్‌ఓఆర్‌ ప్రక్రియ అంతటినీ అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకోసం 80 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. సర్వే శాఖ రీసర్వే పూర్తి చేసిన తర్వాత దీన్ని రెవెన్యూ శాఖ చేపడుతుంది. సర్వే శాఖ కొన్ని రోజులు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ మరికొన్ని రోజులు ఇదే ప్రక్రియను చేయడం వల్ల సమయం వృథా అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సర్వే శాఖ ఇప్పటికే రీసర్వే ద్వారా భూములను కొలిచి తయారు చేసే రికార్డును (రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్‌) ఆర్‌ఎస్‌ఆర్‌గా చూడాలని ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ రూల్స్‌కు సవరణ చేయనున్నారు.

సర్వే శాఖ భూముల్ని కొలిస్తే దానికి ఎవరు యజమాని అనే విషయాన్ని రెవెన్యూ శాఖ నిర్ధారిస్తుంది. ఇప్పుడు సర్వే సమయంలోనే రెండు పనులు అయ్యేలా నిబంధనల్ని సవరిస్తున్నారు. రీసర్వే పూర్తయినట్లు గ్రామాల్లో ఫారమ్‌–13 నోటిఫికేషన్‌ ఇవ్వకముందు తయారు చేసే రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్‌నే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంటే సర్వే రికార్డునే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణిస్తారు.

ఆ తర్వాత పూర్తి వివరాలతో ఫామ్‌–1బీ తయారు చేస్తారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్న భూముల రీసర్వే దీనివల్ల వేగం పుంజుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నోటిఫికేషన్‌ ఇచ్చిన 12 రోజుల తర్వాత సవరణలు అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అందులో పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top