వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి!

AP government will soon sign the MOU for Vehicle Scientific Fitness Test Center - Sakshi

త్వరలో ఎంఓయూ కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాహనాల శాస్త్రీయ ఫిట్‌నెస్‌ పరీక్షా కేంద్రం (ఐ అండ్‌ సీ) నిర్మాణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ కేంద్రం నిర్మాణంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. విశాఖ నగర సమీపంలో గంభీరం వద్ద ఏర్పాటు చేయనున్న ఐ అండ్‌ సీ (ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సెంటర్‌) నిర్మాణానికి కేంద్రం గతంలోనే రూ.16.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల విలువైన భూమిని కేంద్రానికి అప్పగించింది. ఇందులో అధునాతన డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌తోపాటు వాహనం బ్రేక్‌ నుంచి హెడ్‌లైట్లు, కాలుష్య స్థాయిలు, స్టీరింగ్‌ సామర్థ్యం, టైర్లు, సీటింగ్‌ స్థానాలు వంటి ఇతర ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్‌ మోటార్‌ వాహన ఫిట్‌నెస్‌ పరీక్షలు అవసరం లేకుండా చేస్తుంది.  

రాష్ట్ర విభజనతో ఏపీకి ఐ అండ్‌ సీ మంజూరు.. 
► కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో ఐ అండ్‌ సీని మంజూరు చేసింది. గత ప్రభుత్వం దీని ఏర్పాటును పట్టించుకోలేదు. 
► ఈ నెలలో సీఎం వైఎస్‌ జగన్‌తో శంకుస్థాపన చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  
► నిర్మాణం తర్వాత ఈ కేంద్రాన్ని పుణెకు చెందిన ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) తొలి ఏడాది నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆర్‌టీఏ అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చి రవాణా శాఖకు అప్పగిస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఉత్తరాంధ్రలో దాదాపు 250 వాహనాలకు పైగా ఫిట్‌నెస్‌ పరీక్షలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు.  
► నిబంధనల ప్రకారం రవాణా వాహనాలు ట్రక్కులు, క్యాబ్‌లు, పాఠశాల బస్సులు సంవత్సరానికి ఒకసారి ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకోవాలి. ఈ సెంటర్‌లో కంప్యూటర్‌ ఆధారితంగా దాదాపు 30 నుంచి 40 ఫిట్‌నెస్‌ పరిమితుల్లో వాహనాల తనిఖీ జరుగుతుంది.  
► పాఠశాల బస్సులు, భారీ రవాణా వాహనాలకు సరైన ఫిట్‌నెస్‌ లేని కారణంగా చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో ఐ అండ్‌ సీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top