AP: గాల్లోని ‘ఆక్సిజన్‌’ను ఒడిసి పట్టారు!

AP Government Measures No Medical Oxygen Shortage - Sakshi

వచ్చే నెలలో 81 ఆస్పత్రుల్లో 92 పీఎస్‌ఏ ప్లాంట్లు

థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని వేగంగా ఏర్పాట్లు

మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 50, అంతకన్నా పడకలు పైబడిన ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌(పీఎస్‌ఏ) ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 81 సామాజిక, జిల్లా, బోధన ఆస్పత్రుల్లో 92 పీఎస్‌ఏ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటి ఏర్పాటుకు సంబంధించి సివిల్‌ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. నిమిషానికి 500 లీటర్లు, 700 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో రెండు రకాల 92 ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఈ మొత్తం ప్లాంట్ల ఏర్పాటుతో ఆయా ఆస్పత్రుల్లో నిమిషానికి 71,000 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. దీంతో పుష్కలంగా ప్రాణ వాయువు సమకూరనుంది. కరోనా 3వ దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ల ఏర్పాటు పనులను అనతి కాలంలో ప్రభుత్వం వేగవంతంగా చేపట్టింది. 92 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో 61 ప్లాంట్లను ఇప్పటికే ఆస్పత్రుల్లో అమర్చారు. మిగిలిన 31 ప్లాంట్లు నెలాఖరులోగా అమర్చనున్నారు. ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఐసీయూ, నాన్‌ ఐసీయూ పడకలకు ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన సివిల్‌ పనులన్నీ పూర్తయ్యాయి.

ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభం
81 చోట్ల 92 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. డిసెంబర్‌లో అన్ని ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.  
– మురళీధర్‌రెడ్డి, ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top