ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

AP Contract Employees Regular And GPS Pension For Employees - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా జీపీఎస్‌ను తీసుకువచ్చింది. అలాగే, జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారికి 12 శాతం నుంచి 16శాతం హెచ్‌ఆర్‌ఏను పెంచింది. ఇక, 12వ పీఆర్సీ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుకు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేశారు. అప్పుడు వైఎస్సార్ ఇప్పుడు సీఎం జగన్‌ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. మళ్లీ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది.  

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఇచ్చిన హామీలకు, కొత్త పీఆర్సీ కమిటీ వేసేందుకు ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీపీఎస్ ఉద్యోగులకు కూడా న్యాయం చేశారు. సీపీఎస్ ఉద్యోగులు కూడా జీపీఎస్‌ను స్వాగతించాలి. గత ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు.. చేశారా?. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై కూడా  ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదనే ఆలోచనే వద్దు. కచ్చితంగా మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తుంది. 2024లో మళ్లీ సీఎం అయ్యేది వైఎస్‌ జగన్మోహన్ రెడ్డే అని అన్నారు. 

ఇదిలా ఉండగా.. సచివాలయం వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ చరిత్రలో ఈరోజు ఒక మహత్తర ఘట్టం. 2009 నుంచి 2013 మధ్య రిక్రూట్ అయిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. నిన్నటి వరకూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా మేం ఉద్యోగాలు చేశాం.  2023 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం. 

జగనన్నే మా భవిష్యత్తు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతకు మారు పేరు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. గత సీఎం కాంట్రాక్ట్ తుప్పు తెచ్చాడు. సీఎం జగన్ ఆ కాంట్రాక్ట్ తుప్పును వదిలించారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే వ్యక్తి చేయలేని పనిని సీఎం జగన్‌ చేసి చూపించారు. పులి కడుపున పులే పుడుతుంది. ఈ క్రమంలో జై జగన్ నినాదాలతో సచివాలయం ప్రాంగణం హోరెత్తింది. తమను క్రమబద్ధీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగులు నినాదాలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top