రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Launches 165 YSR Veterinary Mobile Ambulance Clinics - Sakshi

సాక్షి, అమరావతి: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య (మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్ప­టికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.­129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసు­కువచ్చిన విషయం తెలిసిందే.

వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధ­వారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి.

81 రకాల మందులు.. 54 రకాల పరికరాలు 
ఈ అంబులెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్‌ సెంటర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్‌ సెంటర్‌ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్‌లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు.

54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్‌ఐకు అప్పగించారు.  కాల్‌ సెంటర్‌కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్‌కాల్స్‌ రాగా, ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. 6,345 వేలకు పైగా మేజర్, 10,859 మైనర్‌ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్యసేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వా­రా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top