చంద్రన్న కానుకలే ఈ చీప్‌ లిక్కర్‌ బ్రాండ్లు.. మేం అనుమతులు ఇచ్చింది లేదు: సీఎం వైఎస్‌ జగన్‌

AP Cheap Liquor Brands Introduced By CBN Only Says CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్‌ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్‌ గుర్తు చేశారు. 

‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌ భూంభూం బీర్‌, పవర్‌ స్టార్‌ 999, 999 లెజెండ్‌.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌.. చంద్రబాబు మెడల్‌ బ్రాండ్‌. గవర్నర్‌ ఛాయిస్‌ 2018, నవంబర్‌ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్‌ బ్రాండ్‌లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్‌ మార్క్‌ బ్రాండ్లు. 

కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్‌ స్టేటస్‌, త్రీ క్యాపిటల్‌ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్‌ అన్నారు. ‘‘2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్‌లన్నీ లైసెన్స్డ్‌ డిస్టిలరీస్‌ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్‌ బ్రాండ్స్‌. 

ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్‌ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్‌ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్‌డ్‌ డిస్టిలరీస్‌ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?’’ అని ప్రశ్నించారు సీఎం జగన్‌. మా ప్రభుత్వం 16 మెడికల్‌ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్‌ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్‌ బ్రెయిన్స్‌ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్‌ చమత్కరించారు.

పీఎంకే డిస్టిలరీస్‌ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్‌ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్‌ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్‌.. సభాముఖంగా నిలదీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top