వికేంద్రీకరణపై చర్చ: రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని కేంద్రమే చెప్పింది: సీఎం జగన్‌

AP Budget Session 2022: CM YS Jagan Objections On HC Captial Orders - Sakshi

సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై  చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. 

పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే అని ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్‌ కూడా ఫైల్‌ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టిపారేసింది.

అందుకే మాకు అధికారం ఇచ్చారు
అయినా  నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్‌ చేస్తాయి? అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకుంటే సిస్టమ్‌ మొత్తం కుప్పకూలి పోతుంది. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టుకున్నారు. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదు.. తమకు బినామీలకు భూములున్న చోట రాజధాని పెట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది.

 

శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా.. ఆచరణా సాధ్యం కానీ తీర్పు ఇచ్చింది హైకోర్టు. అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం అని సీఎం జగన్‌ మరోమారు స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది, అలాగే..
మాస్టర్‌ ప్లాన్‌ కాలపరిమితి 20 ఏళ్లు అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ప్రతీ ఐదేళ్లకొకసారి సమీక్షించాలని కూడా రాశారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. లక్ష కోట్లు అనేది ఇరవై ఏళ్లకు 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. మాకు హైకోర్టుపై గౌరవం ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసన సభా? లేదా కోర్టులా? అనేది క్వశ్చన్‌ మార్క్‌ అవుతుంది.

రాజధానే కాదు.. రాష్ట్ర సంక్షేమం కూడా మాకు ముఖ్యం. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి. అడ్డంకులు ఎదురైనా.. వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గం. న్యాయవ్యవస్థ మీద అచంచల గౌరవం, విశ్వాసం ఉంది. అలాగే.. అందరికి మంచి చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గం. న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను ఓ కొలిక్కి తెస్తాం. రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందరికీ మంచి చేయడానికే మా ప్రభుత్వం ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తూ.. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top