ఏపీ బడ్జెట్‌: రోడ్లకు దండిగా నిధులు.. 

AP Budget: 7594 Crore For Roads And Buildings - Sakshi

బడ్జెట్‌లో రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్లు కేటాయింపు

గతేడాది కంటే రూ.1,005.48 కోట్లు అధికం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు, రవాణా రంగం అభివృద్ధి, రహదారి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2021–22 వార్షిక బడ్జెట్‌లో రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.1,005.48 కోట్లను అధికంగా కేటాయింపులు చేసింది. గ్రామీణ రహదారులను పటిష్టపర్చడం, కచ్చా రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లను రెండు లేన్లుగా అభివృద్ధి చేయడం తమ కార్యాచరణలో భాగమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు

 నాబార్డ్, ఆర్‌ ఆర్‌ ప్లాన్, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈ, ఈఏపీ పథకాల కింద రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడతామన్నారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి రెండు ప్రాజెక్టుల కోసం రూ.6,400 కోట్లు రుణాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. కేంద్రంతో కలిసి కొత్త రైల్వే లైన్ల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కోర్‌ నెట్‌వర్క్‌ రోడ్లు, రాష్ట్ర ప్రధాన రోడ్లు, జిల్లా ప్రధాన రోడ్ల విస్తరణకు అధిక నిధులు కేటాయించింది. ఐఆర్‌సీ ప్రమాణాల మేరకు రోడ్ల నాణ్యత ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను కనీసం 5 శాతం తగ్గించేలా రహదారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. 

చదవండి: AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన

ప్రధాన కేటాయింపులు ఇలా..
► రాష్ట్రంలో 100 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.200 కోట్లు కేటాయించింది. 
►రోడ్ల విస్తరణకు మొత్తం రూ.883.57కోట్లు కేటాయించారు. వాటిలో కోర్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ పరిధిలోని రోడ్లు 340 కి.మీ., జిల్లా ప్రధాన రహదారులు 400కి.మీ., రాష్ట్ర  ప్రధాన రహదారులు 15 కి.మీ., ఎస్టీ సబ్‌ప్లాన్‌ రహదారులు 50 కి.మీ., ఎస్సీ సబ్‌ ప్లాన్‌ రహదారులు 20 కి.మీ. ఉన్నాయి. 
► రాష్ట్రంలో 10వేల కి.మీ. జిల్లా ప్రధాన రహదారులు, 900 కి.మీ. ఇతర రోడ్ల మరమ్మతులకు మొత్తం రూ.481 కోట్లు కేటాయించారు. 
►మండల కేంద్రాలను అనుసంధానించే 100 కి.మీ. మేర రోడ్లను డబుల్‌ లేన్‌ రహదారులుగా విస్తరించేందుకు రూ.175.46కోట్లు, 100 కి.మీ. మేర రోడ్లు/బ్రిడ్జిలు  రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌కు రూ.175.46 కోట్లు కేటాయించారు. 
►మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.123 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. 
►రాయలసీమను అమరావతితో అనుసంధానించే 335 కి.మీ. ‘అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే’ను రూ.18,055 కోట్లతో నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా 250 కి.మీ. మేర భూసేకరణ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. 
► సీఆర్‌ఐఎఫ్‌ పథకం కింద 700 కి.మీ. రోడ్ల అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు కేటాయించారు. 7 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిల కోసం భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. 
►రోడ్డు భద్రత కార్యకలాపాలకు రూ.150 కోట్లు కేటాయించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top