AP Assembly Session 2021: మాది మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం: సీఎం వైఎస్‌

AP Assembly Winter Session 2021 Sixth Day Live Updates - Sakshi

Time: 4:40 PM
ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ, మండలి సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 

Time: 3:30 PM
మనిషి  ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోగ్య ఆంశంపై ప్రసంగించారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు.   

Time: 12:40 PM
ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ బిల్లు సహా ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రజల వినోదానికి ఇబ్బందులు కలగకూడదనే ఈ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో చర్చించామని తెలిపారు. ఆన్‌లైన్‌ టిక్కెటింగ్ వల్ల ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరన్నారు. బ్లాక్ బ్లస్టర్‌.. వందల కోట్లు వసూళ్లు అంటూ చెప్పుకుంటున్నారు. కానీ జీఎస్టీ మాత్రం రావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా పారదర్శకత కోసమే ఆన్ లైన్ టిక్కెట్ల చట్టం తెస్తున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

Time: 11:18 AM
వైఎస్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని  డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం మైనార్టీలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభించిందన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని  పేర్కొన్నారు. అన్ని వర్గాల కన్నా మైనార్టీలు వెనుకబడి ఉన్నారన్నారు. వైఎస్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు దగా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్‌ ఆసరాతో లక్షా 68 వేల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కలిగింది. వైఎస్సార్‌ చేయూత ద్వారా 2.46 లక్షల మంది మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు.

వక్ఫ్‌ ఆస్తులను కంప్యూటరీకరణ చేయడం జరిగింది. వక్ఫ్‌ బోర్డు బకాయిలు చెల్లించడం జరిగింది. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో 43, 680 మైనార్టీలు ఉన్నారు. ప్రైవేటు కంపెనీ బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం ఆదుకుంది. 20 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి రూ.38 కోట్లు ప్రభుత్వం అందించిందని అంజాద్‌బాషా అన్నారు.

Time: 10:31 AM
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో 14వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నాయి. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌తో ప్రజల దగ్గరకే వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Time: 9:26 AM
పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు సేకరించిన భూమి, ఇళ్లులేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాల సంఖ్య చూస్తే ఈ రెండున్నర ఏళ్లలో ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 71 వేల ఎకరాలకుపైగా భూమిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సేకరించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల వద్ద సేకరించిన భూమికి వెంటనే డబ్బులు అందించామని తెలిపారు. అయినా రాజకీయ ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరలో పేదలకు ఇళ్లపట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని అంబటి ఆకాక్షించారు.

Time: 9:23 AM
ఇప్పటివరకు 29.18 లక్షల మందికి  ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం అన్నారు.

Time: 9:15 AM
సాక్షి, అమరావతి: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. నేడు బీసీ జనగణన తీర్మానం మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీ సంక్షేమంపై చర్చ జరపనున్నారు. ఆరోగ్యం, విద్య, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరో మూడు బిల్లులను ప్రభ్వుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top