‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘.. ఈ హోటల్‌లో ఏది కొన్నా రూ.10!

Any Tiffin Only Rs 10 Rupee at Renuka Tiffin Center in Kurnool - Sakshi

రెండు ఇడ్లీ..రెండు పూరి..దోశ..ఉగ్గాని..ఏ అల్పాహారమైనా పది రూపాయలే. ఎక్కడో పల్లె ప్రాంతంలో కాదు.. జిల్లా కేంద్రమైన కర్నూలులో..నమ్మశక్యంగా లేదా? నిజమేనండి! ఒకటి కాదు..రెండు కాదు..తొమ్మిదేళ్లుగా ఇదే ధరతో ఓ హోటల్‌ యజమాని పొద్దున్నే పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఆ వివరాలేమిటో చూద్డామా..

కర్నూలు (ఓల్డ్‌సిటీ): కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో 2012లో రేణుక టిఫిన్‌ సెంటర్‌ వెలిసింది. ఇక్కడ పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. హోటల్‌ యజమాని నాగేశ్వరరెడ్డితో పాటు పది మంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

    

హాటల్‌ సర్వర్‌ నుంచి యజమానిగా.. 
నాగేశ్వరరెడ్డి సొంత ఊరు నందికొట్కూరు మండలం కొణిదెల. తండ్రి రామిరెడ్డి రైతు కూలి. తల్లి సూర్యలక్ష్మీదేవి గేదెలను పోషిస్తూ పాలు అమ్మి జీవనం సాగించేవారు. పదో తరగతి వరకు చదువుకున్న నాగేశ్వరరెడ్డి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జీవనోపాధి కోసం కర్నూలు వచ్చాడు. కొన్ని రోజులు ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేశాడు. అక్కడ అతనికి హోటల్‌ వ్యాపారంలో మెలకువలు తెలిశాయి. ప్రజల అభి‘రుచి’ని గమనించాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన తనలాంటి పేదల కోసం హోటల్‌ను ఏర్పాటు చేయాలని తలంచాడు. ఇందుకు మామ జొన్నగిరి హనుమంతరెడ్డి సహకారం తీసుకున్నాడు. కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో టిఫిన్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో వంద మంది వరకు వచ్చేవారు. తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరకుతుందని తెలిసిన తర్వాత ఆ సంఖ్య వెయ్యి వరకు పెరిగింది.    

తక్కువ లాభంతో.. 
వ్యాపారం ఎవరు చేసినా లాభాలు చూస్తారు. అయితే నాగేశ్వరరెడ్డి మాత్రం తక్కువ లాభంతో ఎక్కువ మందికి మేలు చేస్తున్నాడు. హోల్‌సేల్‌గా సరుకులు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో కొంత ఖర్చు తగ్గుతోంది. ధరలు పెరిగినా..తాను మాత్రం అల్పాహారం ధర పెంచడం లేదని చెప్పాడు. ఎక్కువ మంది కస్టమర్లు ఉండడంతో తనకు నష్టం రావడం లేదని వివరించాడు. వ్యాపారం పెరిగితే మరో ముగ్గురికి అదనంగా ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. తాను పేదరికంలో ఎన్నో కష్టాలను అనుభవించానని, తన లాంటి పేదల కోసం వ్యాపారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు.  

చాలా దూరం నుంచి వస్తున్నా 
మేం సుంకేసుల రోడ్డులో ఉన్న మాసామసీదులో ఉంటాం. ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరుకుతుంది. మా పిల్లాడు వీటిని బాగా తింటాడు. అందుకే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తుంటాను. నేనూ తిని ఇంటికీ తీసుకెళుతుంటా.        
– షేక్‌రఫిక్‌ 

రుచిగా ఉంటుంది 
నేను సంతోష్‌నగర్‌లో ఉంటాను. ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్లే సమయానికి ఇంట్లో టిఫిన్‌ రెడీ అయి ఉండదు. ఎలాగూ ఇక్కడి టిఫిన్‌ రుచిగా ఉంటుందని ఇంత దూరం వస్తుంటా. పైగా ధర తక్కువగా ఉంటుంది.  బయట రెండు ఇడ్లీలకు రూ. 40, దోశకు రూ.30 వసూలు చేస్తున్నారు.   
–ఈశ్వరరెడ్డి 

ఇంట్లో చేసే వంటల్లా ఉంటాయ్‌ 
ఇక్కడి టిఫిన్లు అచ్చం ఇంట్లో చేసిన వాటిలా ఉంటాయి. బయట చట్నీలో కారం ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ప్రతిదీ మోతాదు వరకే వేస్తుంటారు. నేను మున్సిపల్‌  ఆఫీస్‌ వద్ద పనిచేస్తుంటా. ఇంతదూరం వచ్చి టిఫిన్‌ చేసి వెళతా.
– సురేష్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top