చైనా చదువులపై తస్మాత్‌ జాగ్రత్త

Anxiety Among Indian Students Due To Corona In China - Sakshi

సాక్షి, అమరావతి: చైనాలో చదవాలనుకునే విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాటిలో చేరే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) హెచ్చరించాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ ఉమ్మడిగా, ఎన్‌ఎంసీ వేర్వేరుగా ఇటీవల సర్క్యులర్లు విడుదల చేశాయి.

గత కొంతకాలంగా చైనాలో మళ్లీ కోవిడ్‌ తీవ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కోర్సులు ఆఫర్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ సూచించాయి. ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని కోరాయి.

‘కోవిడ్‌ నేపథ్యంలో చైనా ప్రభుత్వం నవంబర్‌ 2020 నుంచి అన్ని వీసాలను సస్పెండ్‌ చేసింది. వీటి కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు చైనాకు తిరిగి వెళ్లలేకపోయారు. ఆ ఆంక్షలను ఇంకా తొలగించలేదు సరికదా చదువుల కొనసాగింపునకు వీలుగా ఇప్పటివరకు పరిమితులతో కూడా సడలింపు ఇవ్వలేదు. ఈ తరుణంలో చైనాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రస్తుత, రాబోయే విద్యా సంవత్సరాలకు వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటీసులు జారీ చేశాయి. వివిధ కోర్సుల్లో చేరిన వారితోపాటు కొత్తగా చేరే వారికి ఆయా కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఆ వర్సిటీలు తెలిపాయి.

భారతదేశంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యసించే డిగ్రీ కోర్సులను యూజీసీ, ఏఐసీటీఈ గుర్తించవు. విద్యార్థులు నిర్దిష్ట డిగ్రీ కోర్సును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేశంలో అనుమతులు లేని కోర్సులను విదేశాల్లో అభ్యసించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి’ అని ఏఐసీటీఈ, యూజీసీ హెచ్చరించాయి. 

ఆన్‌లైన్‌ విధానంలో సమస్యలు..
నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కూడా ఇదే విధమైన నోటీసును ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసింది. చైనా వర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం విధించిన కఠినమైన ఆంక్షల గురించి ముందుగానే నోటీసు ద్వారా తెలియజేసింది.  విదేశీ వర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి తగిన దేశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో 2020 మార్చిలో భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ విధానంలో చదువులను కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ విషయంలో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను చైనాతో చర్చించి పరిష్కరించాలని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top