బీజింగ్: ప్రపంచంలో యుద్ధాల కాలం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ వరుస దాడులతో పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తున్న ఈ సమయంలో.. ఆ యుద్ధం ఆసియా దేశాల వైపు మళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
తైవాన్‌పై చైనా, జపాన్, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌లోని ఘర్షణను పరిష్కరించేందుకు అమెరికాపై పరోక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేక నిజమైన దాడులకు ఈ దేశాలు సిద్ధమవుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
చైనా ఆకాంక్షల నేపథ్యంలో తైవాన్‌పై దాడి చేయడానికి సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా.. తైవాన్‌ను చుట్టుముట్టింది. ఇప్పటివరకు 26 చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూ మోహరించాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఇంత భారీ స్థాయిలో మోహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఆసియా దేశాల్లో ఆందోళనలు,భయాలు మొదలయ్యాయి.


