నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా

Anupu Nagarjuna Sagar: Acharya Nagarjuna University, Ancient Buddhist University - Sakshi

కొండపై సామాన్య శక పూర్వం 2వ శతాబ్దం నాటి బౌద్ధావశేషాలు

ద్వీప ప్రదర్శన శాలలో బుద్ధుని దంత ధాతువు, శిలా శాసనాలు పదిలం

అనుపులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు

కరోనాకు ముందు ఈ ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ పర్యాటకుల సందడి

సాక్షి, గుంటూరు: ‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి’ అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ చరిత్రకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు సమీపంలోని నాగార్జున కొండ, అనుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా.. ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తోంది. నాగార్జున సాగర్‌ నిర్మాణ సమయంలో బయల్పడిన సామాన్య శక పూర్వం (క్రీస్తు పూర్వం) 2వ శతాబ్దం నాటి బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శన శాలలో భద్రపరిచారు.

ఇది ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శన శాలలు అన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల. బుద్ధునిదిగా చెప్పబడుతున్న దంతావశేషం ఇందులో చూడదగ్గవి. బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, స్థూపాలు కొండపై గల ఐలండ్‌ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని అనుపులో దర్శనమిస్తాయి. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు దేశ, విదేశాల బౌద్ధ ఆరాధకులు, పర్యాటకులతో ఈ ప్రాంతాలు కళకళలాడుతుండేవి. కరోనా వ్యాప్తి కారణంగా ఏడాది కాలంగా ఇక్కడ పర్యాటక శోభ తగ్గింది.

144 ఎకరాల విస్తీర్ణంలో..
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జున కొండ. ఈ కొండపై 1966లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలండ్‌ మ్యూజియం ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అనుపులో పదిలంగా ఉన్నాయి. విజయపురి సౌత్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని అనుపులో విశ్వవిద్యాలయం ఉంది. మహాయాన బౌద్ధమత ప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కృష్ణా నది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తాయి.


విశ్వవిద్యాలయ ప్రస్థానం
ఆచార్య నాగార్జునుడు కృష్ణా నది లోయలో విద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు. రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్టు ఆధారాలున్నాయి.


చరిత్రకారులు పాహియాన్, హ్యుయాన్‌త్సాంగ్, ఇత్సింగ్‌ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది. నాగార్జునుని మరణానంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్టు ఆధారాలున్నాయి.  దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, శ్రీలంక, మలేషియా, టిబెట్, భూటాన్, థాయ్‌లాండ్, బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ, అనుపు సందర్శనకు వస్తారు. 

ఆర్థికంగా నష్టపోయాం
కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి పర్యాటకుల తాకిడి లేదు. దీంతో వ్యాపారాలు లేవు. ఆర్థికంగా చితికిపోయాం. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వాలు పర్యాటకంగా మా ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలి. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరచాలి.
– వెంకట్రావు, హోటల్‌ నిర్వాహకుడు, విజయపురి సౌత్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top