
శ్రీశైలానికి 2,89,670 క్యూసెక్కుల వరద ప్రవాహం
203 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
8 క్రస్ట్ గేట్లను తెరిచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల
సాగర్‌లో 305 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
26 క్రస్ట్‌గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
సాక్షి, విజయపురి సౌత్, సత్రశాల (రెంటచింతల), నరసరావుపేట, శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రసుత్తం 305 టీఎంసీలకు చేరుకోవడంతో 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో జలాశయం నుంచి 2,04,048 క్యూసెక్కులు విడుదలవుతోంది. గేట్లతో పాటు విద్యుదుత్పాదనతో మరో 28,420 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఈ నీరంతా దిగువనున్న టెయిల్‌పాండ్ ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతుంది.
టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి 2,38,727 క్యూసెక్కుల నీటిని అధికారులు పులిచింతలకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల నిండుకుండలా మారగా, డ్యాం మూడు క్రస్టు గేట్లను ఎత్తి నీటిని ప్రకాశం బ్యారేజ్ వైపు వదిలారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,58,171 క్యూసెక్కు ఇన్‌ఫ్లో నమోదవగా, అవుట్ ఫ్లో 65,394 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.16 టీఎంసీలకు చేరింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 17,600 క్యూసెక్కుల నీరు కిందకు చేరుతోంది.
శ్రీశైలానికి వరద ఉధృతి..
జూరాల, సుంకేసుల నుంచి 2,89,670 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తుండడంతో మంగళవారం రాత్రి 8 రేడియల్ క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు 2,16,520 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 31వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

కుడిగట్టు కేంద్రంలో 15.638 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.065 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. మంగళవారం సాయంత్రానికి జలాశయంలో 203.8907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.90 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203 టీఎంసీల నీరు నిల్వ ఉంది.