AP SSC Result 2021: ఆంధ్రప్రదేశ్‌: నేడు 'పది' ఫలితాలు

Andhra Pradesh Tenth Exam results will be released on 6th August - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ భవనంలో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఫలితాలను 'www.bse.ap.gov.in' తో పాటు 'sakshieducation.com' వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ‘మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్టు వైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌’లను తమ పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డైరెక్టర్‌ సుబ్బారెడ్డి సూచించారు. డౌన్‌లోడ్‌ చేసిన కాపీలను అటెస్టెడ్‌ సంతకాలు చేసి విద్యార్థులకు ఇవ్వాలని పేర్కొన్నారు. 2020, 2021 రెండేళ్లు కూడా కరోనా వల్ల పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే. 2020వ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు గతంలో ఆల్‌పాస్‌గా ప్రకటించి సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లలో గ్రేడ్లు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది విద్యార్థులకు కూడా.. 2021 విద్యార్థులకు మాదిరిగానే అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించాలని ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2020, 2021కి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు గ్రేడ్లు విడుదల చేయనుంది. 

ఎలా చూసుకోవాలంటే..
2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్‌ నంబర్‌ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top