‘ఈ–శ్రమ’లో 78.47 లక్షల మంది

Andhra Pradesh ranks fifth in enrollment of unorganized workers - Sakshi

అసంఘటిత రంగ కార్మికుల నమోదులో ఐదో స్థానంలో రాష్ట్రం 

అత్యధికంగా 53.38 లక్షల మంది వ్యవసాయ కార్మికులు

ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు పరిహారం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొలిసారిగా అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ–శ్రమ పోర్టల్‌ ద్వారా  కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిద్వారా వారికి సామాజిక భద్రత పథకాలను వర్తింప చేయడంతో పాటు ప్రమాద బీమాను అమలు చేయనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల డేటాను ఈ–శ్రమ పోర్టల్‌ ద్వారా సేకరించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 28.48 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఈ–శ్రమ పోర్టల్‌ ద్వారా వ్యక్తిగతంగా కూడా కార్మికులు వివరాలను నమోదు చేసుకోవచ్చు. 

సచివాలయాల ద్వారా నమోదు
అసంఘటిత రంగ కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా నిర్మాణ కార్మికులు, చేతివృత్తిదారులు, చిరువ్యాపా­రులతో పాటు వ్యవసాయ, వలస కూలీల వివరాలను ఈ–శ్రమ పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,47,859 మంది ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు అయ్యారు.

అత్యధికంగా వ్యవసాయ రంగంలో 53,38,805 మంది, నిర్మాణ రంగంలో 5,66,680 మంది కార్మికులు నమోదు అయ్యారు. వీరిలో మహిళా కార్మికులే అధికం.  55.83 శాతం మహిళా కార్మికులు, 44.16 శాతం పురుష కార్మికులు నమోద­య్యారు. ఈ–శ్రమ పోర్టల్‌లో వివరాల నమోదు పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 150.93 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 7.16 లక్షల మంది, అత్యల్పంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 20,893 మంది కార్మికులు ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదయ్యారు. వివరాల నమోదు అనంతరం అసంఘటిత కార్మికులకు ఈ–శ్రమ కార్డు జారీ చేస్తారు.

ప్రమాదవశాత్తు మృతి చెందితే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు బీమా కింద అందజేస్తారు. ప్రమాదంలో పూర్తి వైకల్యం బారినపడితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తారు. దీంతో పాటు వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను వర్తింప చేస్తారు. ఆయా రంగాల్లో కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top